జమిలీ ఎన్నికలు దేశానికి అవసరం అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా… ప్రతీ సారి ఎన్నికలు జరుగుతూంటే అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని.. ఒకే సారి ఎన్నికలో ఎంతో ముఖ్యమన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఇలాంటికార్యక్రమంలోనే ఎన్నికల సంఘానికి ఇలాంటి సూచనే పంపారు. జమిలీ ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించాలన్నారు. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అన్నది బీజేపీ విధానం. ఇందు కోసం చాలా రోజులుగా కసరత్తు చేస్తోందన్నది బహిరంగ రహస్యం. ఓ రకంగా ఏకాభిప్రాయం కూడా వచ్చింది.
వంద శాతం ఏకాభిప్రాయం మన దేశంలో ఎప్పుడూ సాధ్యం కాదు. మెజార్టీ రాజకీయాల ప్రజాస్వామ్యం కాబట్టి ఆ ప్రకారం చూసుకుంటే ఇప్పటికే ఆమోదం లభించినట్లే. బీజేపీని వ్యతిరేకించే అతి కొద్ది పార్టీలు మినహా అన్నీ అంగీకరించాయి. బీజేపీని వ్యతిరేకించే కొన్ని పార్టీలు కూడా అంగీకారం తెలిపాయి. లా కమిషన్ సిఫార్సులు కూడాచేసింది. ఇప్పుడు బంతి కేంద్రం కోర్టులోనే ఉంది. అటు లోక్ సభ, ఇటు రాజ్యసభలోనూ కావాల్సినంత మెజార్టీ ఉంది. రాజ్యాంగపరంగా ఏమైనా అడ్డంకులు ఉంటే తక్షణం సవరించుకుని ఎన్నికలకు వెళ్లే అవకాశం కేంద్రానికి ఉంది.
కానీ కేంద్రం ఎందుకనో కానీ మాటలు చెప్పడానికే ప్రాధాన్యం ఇస్తోంది కానీ ముందడుగు వేయడంలేదు. జమిలీ ఎన్నికల నిర్వహణ చాలా సవాళ్లతో కూడుకున్నది. దీనికి ఎన్నో సమస్యలు ఏర్పడతాయి… అవన్నీ ఆషామాషీ కాదు. వాటిపై ఇప్పటికీ పరిష్కారాలు దొరకలేదు. అందుకే కేంద్రం ఆలోచిస్తోందని తెలుస్తోంది. అయితే ఏదైతే అదయింది.. చేయాలనుకుంటే కేంద్రం చేయడం.. వారం రోజుల్లో పని. జమిలీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఈసీ కూడా ఎప్పుడో ప్రకటించింది.