ఏపీలో పరిస్థితులు ఏమీ బాగో లేవని .. అప్పులు, అరాచకాలు ఉన్నాయని ప్రధాని మోదీ అన్నట్లుగా టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మీడియాకు తెలిపారు. ఏపీలో పరిస్థితుల్ని తాను వివరిస్తున్నప్పుడు ప్రధాని మోదీ తనకు సమాచారం ఉందని చెప్పారని… ఈ విషయంలో ఆయన జోక్యం కోరామని కూడా వివరించారు. ప్రధాని మోదీ అనని మాటలను అన్నట్లుగా టీడీపీ ఎంపీ ప్రచారం చేసే సాహసం చేయకపోవచ్చు. ఒక వేళ బయటకు చెప్పకూడదన్న సంకేతాలు వచ్చినా చెప్పకపోవచ్చు. మన మధ్య సంభాషణ మీడియాకు చెప్పినా పర్వాలేదన్న సూచనలు వస్తేనే ఏ ఎంపీ అయినా ఇలాంటి ధైర్యం చేస్తారు. కనకమేడల రవీంద్ర కుమార్ ఇలా ప్రధానితో జరిగిన సంభాషణ గురించి చెప్పారంటే.. అందులో కల్పితాలేమీ ఉండవని అనుకోవచ్చు.
ప్రధానమంత్రి మోదీ పంజాబ్‌తో ఏపీని పోల్చారు. పంజాబ్‌లో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తోంది. డ్రగ్స్, రౌడీ గ్యాంగులు చెలరేగిపోతున్నాయి. ఖలిస్తాన్ ఉద్యమం పేరుతో అమృత్ పాల్ సింగ్ అనే యువకుడు చేస్తున్న రచ్చ .. దేశ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నా పట్టుకోలేకపోయారు. ఎనభై వేల మంది పోలీసులు ఉన్నా పట్టుకోలేకపోయారా అని కోర్టులో ఆశ్చర్యపోయాయి .ఇలాంటి అరాచక పరిస్థితులను ఏపీతో పోల్చారు. అయితే ఇక్కడ చాలా మందికి వచ్చే సందేహం… అన్నీ తెలిస్తే ఎందుకు చూస్తూ ఉన్నారు.. ఇకా చెప్పాలంటే ఎందుకు సహకరిస్తున్నారన్నది కీలకం.
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పై వైసీపీ గూండాలు దాడి చేశారు. అది చాలా పక్కాగా జరిగిన నేరం. పోలీసులు ఉద్దేశపూర్వకంగా వారి కాన్వాయ్ ఆపితే.. వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. అయితే పోలీసులు రివర్స్‌లో బీజేపీ నేతలపై కేసులు పెట్టారు. దేశ రెండో అత్యున్నత పురస్కారం పొందిన రామోజీరావుపై అధికార దుర్వినియోగం చేసి భయంకరమైన రాజకీయ కుట్రలు చేస్తున్నరు.. వారి గౌరవాన్ని కాపాడకుండా… అన్నీ తెలుసని మోదీ చూస్తూ ఉరుకున్నారా ? వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి పాత బీహార్ లాంటి పరిస్థితులు ఏర్పడినా ఎందుకు చూస్తూ ఉన్నారు ?
చూస్తూ ఉండటమే కాదు… ఏపీ ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. అడ్డదిడ్డంగా ఆర్థిక నిర్వహణ చేసి.. ఏపీని దివాలా అంచుకు చేర్చినా అడిగినంత అప్పులు ఇస్తూ రాష్ట్రాన్ని మరింత సంక్షోభంలోకి నెడుతున్నారు. అన్నీ తెలిసి ఎందుకిలా చేస్తున్నారు ?