అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తెంపరితనం.. ప్రపంచవ్యాప్తంగా హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది. బ్రిటన్ రాణి పట్ల… ఓ ఆకతాయిగా ఆయన వ్యవహరించిన విధానాన్ని… ప్రపంచం మొత్తం కథలు, కథలుగా చెప్పుకుంటోంది. 90 ఏళ్లు పైబడిన వృద్దురాలిని.. అదీ కూడా.. ప్రపంచంలో అగ్రదేశాల్లో ఒకటైన బ్రిటన్.. ఆ దేశ ప్రజలందరూ అత్యంత గౌరవంగా భావించే రాణిని ట్రంప్.. చాలా తేలికగా తీసుకున్నారు. ఒక్క సంప్రదాయాన్ని.. అధికార మర్యాదనూ పాటించలేదు. ఇదొక్కటే కాదు.. ఆయన చాలా దేశాల్లో తాను ఆకాశం నుంచి ఉడి పడ్డానని.. మిగతా దేశాల అధినేతలు సామాన్యులన్నట్లుగా చూస్తారు. అది ఆయన అగ్రరాజ్య ఆధిపత్య అహంకారానికి నిదర్శనమన్న విశ్లేషణలున్నాయి. అలాగే వయసు మీద పడినా… ఎదగని బుద్ది లక్షణాలన్న విమర్శలు కూడా ఉన్నాయి.
ఏదైనా కానీ.. అలాంటి వ్యక్తిని.. అమెరికా అధ్యక్షుడన్న కారణంగా.. ప్రధాని .. రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని భారత్ తరపున అధికారిక ఆహ్వానం వెళ్లింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నారు. ఈ విషయం తెలిసి చాలా మంది ప్రజలు ఆశ్చర్యపోయారు. అమెరికా అధ్యక్షుడ్ని గౌరవంగా ఇండియాకు పిలిపించి.. అవమానింపచేసుకునే ప్రయత్నం చేసుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాతో పాటు శక్తివంతమైన దేశంగా ఉన్న బ్రిటన్ రాణి పట్లే అంత ఆమర్యాదకరంగా ప్రవర్తించిన ట్రంప్… ఇండియాకు వచ్చి మోడీని అవమానించకుండా ఉంటారని ఎవరూ అనుకోవడం లేదు.
నరేంద్రమోడీ.. ఇటీవల కాలంలో అమెరికా పట్ల అమితమైన అనురాగం చూపుతున్నారు. దానికి కారణమేమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. అమెరికాతో మిత్రత్వం వల్ల శత్రుదేశాలు పెరిగిపోతున్నా ఆయన పట్టించుకోవడం లేదు. అమెరికా ఏమైనా భారత్ పట్ల.. అంత సానుకూలత చూపుతోందా.. అంటే అదీ లేదు. ఇరాన్ నుంచి చమురు దిగుమతులు నిలిపివేచయకపోతే .. ఆంక్షలు విధిస్తామని..ట్రంప్ భారత్‌ను బెదిరిస్తున్నారు. ఈ బెదిరింపులకు లొంగి.. కొంత కాలంగా.. ఇరాన్ నుంచి ఆయిల్ దిగుతమతును కేంద్రం తగ్గించుకుంటూ వస్తోంది. దీని వల్ల భారత్ ఓ చిరకాల మిత్రదేశాన్ని కోల్పోతోంది.
ఈ ఒక్క విషయంలోనే కాదు.. భారతీయుల వీసాల దగ్గర్నుంచి ఔట్ సోర్సింగ్ కంపెనీల వరకు.. ట్రంప్.. భారత్‌పై ఓ రకంగా విషమే చిమ్ముతున్నారు. అయినా నరేంద్రమోడీ.. ఆయనకు.. లొంగిపోయేదశలోనే విదేశాంగ విధానాలు అమలు చేస్తున్నారు కానీ… టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా వ్యవహరించడం లేదు. ఇప్పుడు రిపబ్లిక్ డే వేడుకలకు అతిధిగా పిలవడంలోనూ.. అదే ఉత్సాహం కనిపిస్తోంది.