” కాంగ్రెస్ ముక్త్ భారత్” ఇది బీజేపీ నినాదం. కానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీని ప్రసంగాలు చూడండి.. ఆ నినాదం బీజేపీ ఇచ్చింది కాదు.. మహాత్మాగాంధీ ఇచ్చినదేనంటారు ఆయన. ‘కాంగ్రెస్ రహిత భారత్’ అనేది మహాత్మా గాంధీ ఇచ్చిన నినాదమేననీ ఆయన చూపిన మార్గంలో వెళ్తున్నామని తన ప్రసంగాల్లో తరచూ చెబుతూంటారు. పార్లమెంట్‌తో పాటు బయట ఎన్నికల సభల్లోనూ అదే నినాదం వినిపిస్తూంటారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత కాంగ్రెస్‌ను రద్దు చేయాలనీ, ఇక దాని ఆవశ్యకత లేదనీ గాంధీయే అన్నారని చెబుతూంటారు. మహాత్ముడు కోరుకున్న భారతదేశం మనకు కావాలంటూ… మోదీ మార్క్ భావోద్వేగాన్ని రెచ్చగొడుతూంటారు. దీని వెనుక చాలా పెద్ద ప్లానే ఉంది. దాన్ని ఈ ఏడాది అమలు చేయబోతున్నారు.
వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో మహాత్ముని 150వ జయంతి వస్తుంది. ఇంత కన్నా మంచి అవకాశం మోదీకి ఎక్కడ దొరుకుంది. అందుకే రూ. 150 కోట్లు ఖర్చుపెట్టి.. మహాత్ముని 150వ జయంతి వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందు కోసం ముఖ్యమంత్రులు, మాజీ ప్రధానులతో సహా 114 మందితో ఓ కమిటీ వేశారు. ఆ కమిటీతో సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. వేడుకలు ఎలా నిర్వహించాలో కమిటీ సూచనలు సలహాలు చేస్తుంది. దాన్ని కేంద్రం అమలు చేస్తుంది. కానీ అందర్నీ భాగస్వాములం చేశామన్న పేరుకే తప్ప.. ఈ కమిటీతో ఒరిగేదేమీ ఉండదు. అంతిమంగా బీజేపీ చేసే ప్రచారం.. గాంధీ చెప్పారంటూ.. “కాంగ్రెస్ ముక్త భారత్ ” నినాదాన్ని దేశవ్యాప్తంగా హోరెత్తించడమే.
మహాత్మాగాంధీని రాజకీయాలకు వాడుకోవడంలో.. మోదీని మించిన వారు లేరు. మహాహాత్ముని జయంతి.. ప్రతీ ఏటా ఘనంగానే జరుపుతూంటారు. ఆయనను ఘనంగా స్మరించుకుంటారు.ఈ సారి మాత్రం ఎన్నికల కలరింగ్ ఇస్తున్నారు మోదీ. ఈ విషయం కాంగ్రెస్ నేతలకు అర్థమయిందో లేదో కానీ.. గాంధీని మాత్రం మోదీ తన రాజకీయాలకు వాడుకుంటున్నారన్న విషయం మాత్రం క్లారిటీ ఉంది. గతంలో.. అమిత్ షా.. మహాత్ముడ్ని కులంతో ముడిపెట్టి.. తెలివైన వైశ్యుడంటూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్త దుమరాన్ని రేపాయి. మహాత్ముడికి కులం అంటగట్టిన బీజేపీ.. రేపు.. పార్టీ కూడా అంటగట్టి.. కొద్ది మంది వాడే మహాత్ముడు అని చెప్పే ప్రయత్నం చేయడం ఖాయమన్న భావన ఏర్పడుతోంది. మొత్తానికి బీజేపీ మహాత్మాగాంధీ భుజాలపై తుపాకీ పెట్టి కాంగ్రెస్‌ను కాల్చేయాలని డిసైడయింది. అది కూడా… అందర్నీ కలిపేసి… అందరి ఆమోదం ఉందన్నట్లుగా చేసి.. ఆ పని చేద్దామనుకుంటున్నారు. మోదీ ప్లాన్ వర్కవుట్ అవుతుందో.. రివర్స్ అవుతుందో వేచి చూడాలి…!