పొగడ్డలకు కూడా హద్దులుంటాయి.ఇందిరాగాంధీ నుంచి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను పాలిస్తున్న ఇద్దరు చంద్రుల వరకూ చుట్టూ వందిమాగధులుంటారు. అనేక రూపాల్లో వారి భజన చేసి తరించే నేతలూ వుంటారు. ఇందిరే ఇండియా అన్నది ఒకప్పటి కాంగ్రెస్ అద్యక్షుడు దేవకాంత బారువా నినాదం. ఇప్పటికీ భజన రాయుళ్లను విమర్శించడానికి ఉపయోగిస్తుంటారు. కాని బిజెపి సీనియర్ నేత, వాగ్ధాటికి మారుపేరైన తెలుగు బిడ్డ వెంకయ్య నాయుడు బారువాను మించిపోయారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి దేవుడిచ్చిన కానుక అని అభివర్ణించి ఆనందపడిపోయారు. ఆయనకీర్తి ప్రభలు ఇప్పుడు అత్యున్నత స్థాయిలో వున్నాయని అందుకే అసూయతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. వీటిని పట్టించుకోకుండా మోడీకి మద్దతునివ్వాలని వెంకయ్య పిలుపునిచ్చారు. ఇదే సభలో మాట్లాడిన అరుణ్‌జైట్లీ అంత దూరం వెళ్లకుండా కేవలం రాజకీయ వ్యాఖ్యలతో సరిపెట్టారు.ఇక సమావేశం నిర్ణయాలను వివరించిన రాజ్‌నాథ్‌సింగ్‌ను దీనిపై ప్రశ్నిస్తే నేను ఆ సమయంలో లేనుఅని తప్పుకున్నారు.తమ పార్టీ సీనియర్ నేతలే ఆమోదించలేని ఈ వ్యాఖ్యలు వెంకయ్య నాయుడు వంటి సీనియర్ నేతకు అవసరమా అనేది ప్రశ్న. ఈ సమావేశంలోనే మోడీ మాట్లాడుతూ తమపై రాజకీయంగా విమర్శలు చేస్తే ఫర్వాలేదుగాని దేశాన్ని ఏదైనా అంటే ఒప్పుకోవద్దని ఉద్బోధించారు. మోడీపట్ల వ్యతిరేకత దేశంపట్ల వ్యతిరేకతగా మారుతున్నదని ప్రసార భారతి చైర్మన్‌గా నియమితుడైన ఎ.సూర్య ప్రకాశ్ చేసిన విమర్శను గుర్తు చేసుకుంటే మోడీని లేదా ఆయన ప్రభుత్వాన్ని అనడమంటే దేశాన్ని అనడమేనని చిత్రిస్తున్నారనేది స్పష్టమవుతుంది.