గత ఏడాది నవంబర్ 8.. సగటు భారతీయుడు మరచిపోలేని తేదీ అది. సామాన్య ప్రజలను నానా కష్టాలకూ గురిచేసిన పెద్ద నోట్ల రద్దు అనే చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్న రోజు అది. దేశంలో నల్లధనం కోరలు పీకేస్తామనీ, ఉగ్రవాదానికి ఊతం లేకుండా చేస్తామనీ, నకిలీ నోట్లకు నామరూపాలు లేకుండా చేస్తామనీ, దేశమంతా నగదు రహిత లావాదేవీలు తెస్తామనీ… అబ్బో చాలా చాలా చెప్పార్లెండి! కష్టపడి సంపాదించిన నగదు కోసం నానా అవస్థలు పడాల్సిన పరిస్థితిని తెచ్చారు. ఇంత కష్టం సామాన్యులకు అవసరమా అంటే… ఇదంతా పురిటి నొప్పులే, ఇదో మహా యజ్ఞం అంటూ అప్పటి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సన్నాయి నొక్కలు నొక్కారు. తగుదునమ్మా అంటూ కేసీఆర్ సాబ్, చంద్రబాబు నాయుడుతోపాటు వగైరా వగైరాలు కూడా మోడీ నిర్ణయానికి మోకరిల్లారు. అద్భుతాలు జరిగిపోతాయన్నారు. అయితే, తాజాగా ఆర్బీఐ తేల్చిన లెక్కలు తెలిస్తే… పెద్ద నోట్ల రద్దు ఒక చారిత్రక తప్పిదం, ఘోర వైఫల్యం అనేది తేలుతుంది. వ్యవస్థలోని 99 శాతం పెద్ద నోట్లు బ్యాంకులకు చేరిపోయినట్టు ఆర్బీఐ తాజాగా ప్రకటించింది.
తిరిగిరాని సొమ్ము రూ. 16 వేల కోట్లే అని తేలింది. అంటే, దేశంలో నల్లధనం లేదన్నట్టు! లేదంటే.. బ్లాక్ మనీని కూడా చాలా తెలివిగా వైట్ చేసేసుకున్నారా..? కొత్త నోట్ల ముద్రణా, వాటి రవాణా, సిబ్బంది ఖర్చులూ అన్నీ కలిపి రూ. 21 వేల కోట్లు ఖర్చు అయిందని మాజీ ఆర్థికమంత్రి చిదంబరం లెక్కలు చెబుతున్నారు. అంటే, పెద్ద నోట్ల రద్దుతో ఏం సాధించినట్టు..? దేశాన్ని ఎటువైపు తీసుకెళ్లినట్టు..? ఈ నిర్ణయంతో చిన్నతరహా పరిశ్రమలు కుదేలైపోయాయి. రియల్ ఎస్టేట్ రంగం భారీ నష్టపోయింది. ఎన్నో పరిశ్రమలు మూతపడే పరిస్థితి. ఇవన్నీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు. చిట్టచివరకు ఈ నిర్ణయంతో ఏం సాధించారంటే… గుండు నిండు సున్న!
ఆర్బీఐ లెక్కల ప్రకారం చూసుకుంటే… ఇదో ఘోర వైఫల్యం. ప్రజలను నిలువునా ముంచేసిన నిర్ణయం. ఇంత పెద్ద ఫెయిల్యూర్ గురించి జాతీయ స్థాయిలోగానీ, రాష్ట్ర స్థాయిలోగానీ పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎందుకు రావడం లేదు..? మీడియా వేదికలపై కూడా చర్చ ఎందుకు జరగడం లేదు..? జరిగిందేదో జరిగిపోయిందీ అని సామాన్యులు గతానుభవాలను మరచిపోతున్నారా..? సోకాల్డ్ చారిత్రక నిర్ణయాన్ని సమర్థించిన వెంకయ్య , కేసీఆర్, చంద్రబాబు వగైరా వగైనా నేతలు ఇప్పుడు ఎందుకు దాని గురించి మాట్లాడటం లేదు..? నగదు రహితాలంటూ నానా హడావుడి చేసిన పెద్దలేమయ్యారు..? దేశ ప్రజలను టోకున ఇబ్బందుల్లోకి నెట్టేసి, వారి జీవన విధానాన్ని అస్తవ్యస్థం చేసిన మోడీ నిర్ణయంపై చర్యలు ఎవరు తీసుకుంటారు..? ఈ తప్పుకు శిక్ష ఏది..?
ఒక్కమాటలో చెప్పాలంటే.. మోడీ సర్కారు ధైర్యం కూడా ఇదే! ఈ వైఫల్యాన్ని ప్రశ్నించేంత శక్తి సామర్థ్యాలు ప్రతిపక్షానికి లేవు! కాంగ్రెస్ నేతలు ఢిల్లీ స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నా… దాన్ని ప్రజల్లోకి ప్రధానంగా తీసుకెళ్లే మీడియా సంస్థలూ తక్కువే అని చెప్పాలి. మోడీ భజనలో తరించేవారే ఎక్కువ ఉన్నారు! పోనీ.. రాష్ట్రాల్లోనైనా ఈ ఘోర వైఫల్యంపై ఇతర పార్టీలు స్పందించే అవకాశం ఉందా.. అంటే, అదీ లేదు. ఎందుకంటే, మోడీతో దోస్తానా కోసం ఎదురుచూసేవాళ్లే ఎక్కువైపోయారు. మోడీ నిర్ణయాలు అబ్బో అబ్బో అంటూ మెచ్చుకోవడానికి ముందుండేవారెరవ్వరూ వైఫల్యాలపై పెదవి విప్పే పరిస్థితి లేదు. ఎవరి ప్రయోజనం వారికి కావాలి… ప్రజల ప్రయోజనాలు తప్ప!
ఇక, సోషల్ మీడియా… డేరా బాబాల గురించి మాట్లాడతారు, సుత్తి కొట్టే కత్తిగాళ్ల కామెంట్లకు చర్చిస్తారు, సామాన్యుడికి ఏమాత్రం పనికిరాని దిక్కుమాలిన టెలివిజన్ షోల గురించి, ఎలిమినేషన్ల గురించి జడ్జిమెంట్లు ఇస్తారు. రోడ్ల మీద ముద్దుల వాల్ పోస్టర్లు వేస్తే తప్పేంటని వితండం చేస్తారు.! ఇలాంటి వాళ్లే ఎక్కువైపోయారు. అంతేగానీ, దేశ ప్రగతిని వెనక్కి నెట్టేసిన నోట్ల రద్దు వంటి నిర్ణయంపై స్పందించేవారు ఎంతమంది..?