ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ.. సర్వేలు కూడా.. పెద్ద ఎత్తున వస్తున్నాయి. జాతీయ మీడియాల సర్వేల్లో తాజాగా.. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి రావడం కష్టమని.. హంగ్ పార్లమెంట్ రావడం ఖాయమన్న సర్వేలు విడుదల చేస్తున్నాయి. తాజాగా ఇండియా టుడే, సీవోటర్ సంస్థలు ప్రకటించిన సర్వేల్లోనే ఎన్డీఏ 233 సీట్ల దగ్గరే ఆగిపోతుదంని తేలింది.
ఎలా చూసినా బీజేపీకి 100 సీట్లు తగ్గడం ఖాయమే..!
భారతీయ జనతా పార్టీ.. వచ్చే ఎన్నికల్లో వంద సీట్లకు పైగా కోల్పోతోందని.. గతంలో నేను ఎన్నో సార్లు చెప్పారు. అనేక సందర్భాల్లో.. ఏయే రాష్ట్రాల్లో బీజేపీ నష్టపోయే అవకాశం ఉందోకూడా విడమర్చి చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో మిత్రపక్షం ఆప్నాదళ్ తో కలిసి.. బీజేపీ 80 లోక్ సభ స్థానాలకు గాను 73 చోట్ల విజయం సాధించింది. ఈ సారి యాభై కన్నా ఎక్కువ తగ్గిపోయే అవకాశం ఉంది. అక్కడ ఎస్పీ, బీఎస్పీ పొత్తులు పెట్టుకున్నాయి. ఇక ఇటీవల ఓడిపోయిన మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్‌లలోనూ.. ఫలితాలు తేడా రావడం ఖాయమే. ఇక గుజరాత్, ఉత్తరాఖండ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లోనూ బీజేపీ మంచి ఫలితాలు సాధించినా.. గతంలో వచ్చినన్ని సీట్లు రావు. కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన చోట.. వాటికి అడ్వాంటేజ్ ఉంటుంది. దక్షిణాదిలో ఆ పార్టీకి వేళ్ల మీద లెక్క పెట్టగలిగినన్ని సీట్లు వస్తాయో లేదో చెప్పలేం. అందుకే ఇండియా టుడే సర్వేలో వంద సీట్లు తగ్గిపోతాయని.. అంచనా వేశాయి.
హంగ్ వస్తే బీజేపీకి కొన్ని ప్లస్ పాయింట్లున్నాయి..!
హంగ్ పార్లమెంట్ వస్తుంది. హంగ్ పార్లమెంట్ వస్తే ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనే ప్రశ్న వస్తుంది. బీజేపీకి మరో ప్రమాదం ఏమిటంటే… రాజకీయ పార్టీలకు ఆదరణ తగ్గుతోంది అంటే.. ఏదైనా గొప్పగా మార్పు చేసే కారణాలు ఉంటే తప్ప.. ఆ పతనం అలా సాగుతూనే ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఓ వార్నింగ్ లాంటిది. ఈ విషయం తెలుసు కాబట్టే… కేంద్ర ప్రభుత్వం చాలా హడావుడి నిర్ణయాలు తీసుకుని బయటపడే ప్రయత్నం చేస్తోంది. అందులో ఒకటి అగ్రవర్ణాలకు.. రిజర్వేషన్లు కల్పించడం. దీని ద్వారా ఏమైనా ప్రయోజనం వచ్చిందో లేదో అన్న సందేహం ఉండనే ఉంది. మరి ఎన్డీఏకు మెజార్టీ రాకపోతే.. మోడీ ప్రధానమంత్రి కాలేరా..? అంటే.. ఇక్కడ కొన్ని అశాలను గుర్తించాలి. బీజేపీ తగ్గిపోతోందని చెబుతున్నారు.. కానీ.. కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ సర్వేలు ఇవ్వడంలేదు. కొన్ని సీట్లు పెరుగుతున్నాయి కానీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం రాదు. అదే సమయంలో.. బీజేపీ అతి పెద్ద పార్టీగా ఉంటుంది. బీజేపీకి కొన్ని సానుకూలతలు ఉన్నాయి. వాజ్‌పేయి హయాంలో.. బీజేపీని ఓ అంటరాని పార్టీగా చూశారు. ఇప్పుడు అలా చూడటం లేదు. అవకాశం వస్తే బీజేపీతో కలిసే పార్టీలే ఎక్కువ.
ఇప్పుడు బీజేపీ టచ్ మి నాట్ పార్టీ కాదు..!
అయితే భారతీయ జనతా పార్టీకి ఉన్న మైనస్.. ఎక్కువగా ప్రాంతీయ పార్టీలకు.. బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. ప్రధాన ప్రత్యర్థితో.. ఎవరూ రాజకీయంగా చేతులు కలపరు. అదే బీజేపీకి మైనస్. అలాగే భారతీయ జనతా పార్టీ.. ఇప్పుడు సైద్ధాంతికపరంగా… ముడుచుకుని కూర్చోలేదు. ఇతర పార్టీల నుంచి ఎవరు వచ్చినా పార్టీలో చేర్చుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సహా.. ఎవరు వచ్చినా.. పార్టీలో చేర్చుకుంటున్నారు. ఈశాన్యంలో సర్బానంద సోనోవాల్ దగ్గర్నుంచి దక్షిణాదిలో కన్నా లక్ష్మినారాయణ వరకు. బీజేపీతో.. ఆరెస్సెస్ తో సంబంధం లేని నేతలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరి ఉన్నత పదవులు అనుభవిస్తున్నారు. అంటే.. ఎవరు వచ్చినా కలుపుకుపోతున్నారు. సిద్ధాంతాలకు పెద్దగా విలువలేదు. దీని వల్ల ఏ పార్టీలతో అయితే బీజేపీ కలిసే అవకాశం ఏర్పడుతోంది. అదే.. సమయంలో కాంగ్రెస్ వ్యతిరేకత ప్రజల్లో ఉంది. ఏపీలో టీడీపీ, ఒడిషాలో బీజేడీ కూడా.. యాంటీ కాంగ్రెస్ పార్టీలు. ఆ పార్టీతో కలిసేందుకు వెనుకడుగు వేస్తున్నాయి.
మోడీని తీసేస్తే మద్దతిచ్చేందుకు పార్టీలు వస్తాయా..?
ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ వ్యతిరేకత లేదు. కానీ.. యాంటీ మోడీ ఉంది. యాంటీ ఆరెస్సెస్ కూడా లేదు. యాంటీ మోడీయిజం.. ఎక్కువగా ఉండి.. అధికారాన్ని దూరం చేసే పరిస్థితి ఉంటే.. వెంటనే.. మోడీని పక్కన పెట్టేస్తారు. ప్రత్యామ్నాయాన్ని రెడీ చేస్తారు. అందుకే నితిన్ గడ్కరీ పేరును రెడీ చేశారు. రేపు యాంటీమోడీయిజం ముదుకొచ్చినప్పుడు… ప్రధానిని మార్చేస్తారు. అంతే కాదు.. బీజేపీ అతి పెద్ద పార్టీగా ఉంటుంది. అదే సమయంలో… ఓటింగ్ భారీగా ఉన్న రాష్ట్రాల్లో… ఏదైనా చిన్న… మార్పు జరిగినా అడ్వాంటేజ్ వస్తుంది. అంటే.. బీజేపీ తగ్గిపోతోంది… బలం కోల్పోతోంది.. అన్నది నిజమే కానీ.. ఆ పార్టీ పనైపోయింది అని మాత్రం చెప్పుకోలేం.