హైదరాబాద్: ఒకవైపు కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీలపై దాడికి సంబంధించి ఎమ్ఐఎమ్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వివాదంలో ఇరుక్కుని ఉండగా, మరోవైపు ఆయన సోదరుడు అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం సృష్టిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధి, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధిలతో దారుస్సలామ్ గడప నాకిస్తానని అక్బర్ రంకెలు వేసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో రౌండ్స్ కొడుతోంది. ప్రధానమంత్రి మోడితో కలిసి కాంగ్రెస్‌ను సర్వనాశనం చేసి ఆ శవాన్ని మోడితో కలిసి మోస్తానని కూడా అక్బర్ ఆ వీడియోలో అన్నారు. కాంగ్రెస్‌ను దేశమంతా వెంటాడతానని, నామరూపాలు లేకుండా చేస్తానని నిప్పులు చెరిగారు. బాబ్రీ మసీదు కూల్చివేతతో సహా దేశంలో ముస్లిమ్‌ల పేదరికానికి కాంగ్రెస్సే కారణమని అన్నారు. బీజేపీ ఆవిర్భావానికి కారణంకూడా కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు. ఇందిరాగాంధి ఎక్కడా దొరకనట్లు ఇటలీ నుంచి కోడలిని తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. గతంలో ఇందిరాగాంధి వచ్చినట్లు, సోనియా, రాహుల్ ఎమ్ఐఎమ్ ప్రధాన కార్యాలయమైన దారుస్సలామ్కు వచ్చి మద్దతునీయమని కోరే పరిస్థితి కల్పిస్తానని అన్నారు. గత నెల 30న జీహెచ్ఎమ్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బాబానగర్‌లో నిర్వహించిన ప్రచార సభలో అక్బర్ ఈ ప్రసంగం చేసినట్లు చెబుతున్నారు.
అక్బరుద్దీన్ మొదటినుంచి వివాదాలకు మారుపేరన్న సంగతి తెలిసిందే. గతంలో 2012 డిసెంబర్లో అదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో ఒక సభలో మాట్లాడుతూ, పోలీసులు 15 నిమిషాలు పక్కకు తప్పుకుంటే వందకోట్ల మంది హిందువులను లేపేస్తామని అనటంతోపాటు హిందువుల పండగల గురించి, దేవుళ్ళ గురించి అభ్యంతరకరంగా మాట్లాడారు. ఆ ప్రసంగం వీడియో బయటపడటంతో ఆ వ్యాఖ్యలు బయటకొచ్చాయి. దానిపై దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అక్బర్‌ను అరెస్ట్ చేసింది కూడా. అయితే తర్వాత అధికారంలోకొచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మజ్లిస్‌తో దోస్తీ కట్టటంతో ఆ కేసు మరుగున పడిపోయింది. 2011లో అక్బర్‌పై ప్రత్యర్థులు దాడిచేయగా ఆయన శరీరంలోకి రెండు బుల్లెట్లు వెళ్ళాయి…17 కత్తిపోట్లు దిగాయి.