అవినీతిని ఎంత మాత్రం సహించబోమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి వాక్రుచ్చారు. అది దేశ ప్రగతిని దెబ్బతీయడంతో పాటు ప్రజల హక్కులను సైతం కాలరాస్తోందట. సీబీఐ, సీవీసీ అధికారుల సంయుక్త సదస్సును ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన అవినీతి వ్యతిరేకంగా ప్రసంగించారు. విదేశాల్లో దాక్కున్నా తీసుకు రావాలని..,. ఎంతటి వారినైనా వదలొద్దని ఆయన అధికారులకు నోటి మాటగా చెప్పారు.
అదే సందర్భంలో దేశంలో అవినీతి అణచివేత సాధ్యమవుతుందనే విశ్వాసం ప్రజల్లో కలిగించామని తమకు తాముగా సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు. కానీ ప్రజలు అలా అనుకోవడం లేదు. ఎంతటి అవినీతి పరులైనా బీజేపీలో చేరితే అంతా నీతి అయిపోతుందని.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరని అనుకుంటున్నారు. అది ఆర్థిక పరమైన అవినీతి మాత్రమే కాదు… హత్యలు, అత్యాచారాలు లాంటి దారుణమైన ఘటనలకు పాల్పడే వారికి కూడా బీజేపీ ఓ షెల్టర్‌గా మారిపోయింది. వారపై ఈగ వాలడం లేదు.
బీజేపీలో చేరే వారే కాదు.. వారి రాజకీయ అవసరాలు తీర్చే వారిలో అవినీతి పరులు ఉన్నా రక్షిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొన్ని వేల కోట్ల ప్రజాధనం బొక్కేసి.. నిర్భయంగా రాజకీయాలు చేస్తున్నవారు.. విచారణలు ఆలస్యం చేసుకుంటూ ఇంకా ఇంకా దోపిడికి పాల్పడుతున్న వారు కళ్ల ముందే ఉన్నారు. అన్ని సాక్ష్యాలు ఉన్నా.. వారిని రాజకీయ అవసరాల కోసం కాపాడుతూనే ఉన్నారు. కానీ బయటకు మాత్రం… అవినీతిని అంత మొందిస్తామని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు.
గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి.. ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి ప్రజలు తేడా చూస్తున్నారు. గతంలో అవినీతికి పాల్పపడిన వారిలో సొంత పార్టీ నేతలను కూడా కాంగ్రెస్ జైలుకు పంపింది. కానీ ప్రస్తుతం మాత్రం సొంత నేతలు.. మద్దతిచ్చేవారిని కూడా బీజేపీ కాపాడుతోంది. ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఇదే.