ఏపీకి ప్రధాని మోదీ వస్తున్నారు. అయితే పూర్తిగా అధికారికంగా సాగుతోంది. ఎన్నికల సమయంలో వస్తున్నందున ఓ రాజకీయ సభ పెట్టుకోవడం ఆనవాయితీ. అయితే రాజకీయ సభ కాకుండా కేవలం ఓ మాదిరి పబ్లిక్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఇందులో మోదీతో పాటు గవర్నర్, సీఎం కూడా పాల్గొంటారు. రాజకీయాలు మాట్లాడే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు.
విభజన చట్టంలో భాగంగా కేటాయించిన కేంద్ర విద్యాసంస్థలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ అనంతపురంలో ఏర్పాటు చేయించారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు. పెనుగొండ నియోజకవర్గం పాల సముద్రం గ్రామమంలో 500 ఎకరాలను కేటాయించారు. ఆ స్థలంలో ఇప్పటికి నిర్మాణం పూర్తి చేశారు. 1400 కోట్లతో నిర్మించిన నాసిమ్ను మోదీ ప్రారంభిస్తారు.
పుట్టపర్తి విమానాశ్రయంలో ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని మోదికి సీఎం జగన్ స్వాగతం పలుకుతారు. తర్వాత మోదీ లేపాక్షిలో పర్యటిస్తారు. లేపాక్షి వీరభద్ర స్వామి దేవాలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత పాల సముద్రం కి చేరుకుంటారు. రుద్రాక్ష మొక్కలు నాటి భవన నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికులతో మాట్లాడతారు. ఫ్లోరా ఆఫ్ పాలసముద్రం పుస్తకాన్ని ఆవిష్కరించి సభలో మాట్లాడతారు.
జగన్ రెడ్డిలా ప్రజాధనంతో పథకాల బటన్లు నొక్కే ప్రోగ్రాములు పెట్టి విపక్షాలపై బూతులు మాట్లాడే స్థాయిలో ప్రధాని రాజకీయం ఉండదు. రాజకీయాలు పార్టీ సభల్లో మాట్లాడతారు. అందుకే రాజకీయాలపై మాటలు ఉండకపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. అయితే జగన్ తాను మోదీకి ఎంతో దగ్గరని చూపించుకునేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి.