ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చేస్తున్న ప్రచారమేంటీ… సర్జికల్ దాడులు, పాకిస్థాన్ భూభాగంలోకి దూసుకెళ్లడం, హిందుత్వ, బీసీ కార్డు, చిన్న వ్యాపారులను మహాత్మా గాంధీ కులస్థులని చెప్పడం, కాషాయ ధారణ.. ఇలాంటి అంశాలే కదా! గడచిన ఐదేళ్ల పాలనలో ఆయన సాధించిన విజయాల గురించి మాట్లాడటం లేదు. మొన్నటికి మొన్న బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా 2014 ఎన్నికలకు ముందున్న మోడీని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఇంకా ఛాయ్ వాలా, సామాన్యుడు… అంటూ ఐదేళ్ల కిందటి ఇమేజ్ ని ఇప్పుడు గుర్తుచేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతేగానీ, ప్రధానిగా సాధించిన విజయాలను అస్సలు ప్రస్థావించడం లేదు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల జరిగిన మేలుపై ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు..!
నోట్ల రద్దు నిర్ణయం తరువాత రూ. 1.30 లక్షల కోట్ల సొమ్మును అధికారులు స్వాధీనం చేసుకున్నారన్నారు. దాదాపు 3 లక్షలకు పైగా డొల్ల కంపెనీలు మూతపడ్డాయన్నారు. ఆదాయపన్ను వసూళ్లు రెండింతలైందనీ, ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గిపోయిందని మోడీ చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఇన్ని మంచి ఫలితాలు వస్తే… పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు పోయాయంటూ కొందరు దుష్ప్రచారం చేశారని మోడీ ఆరోపించారు! ఇలా ప్రచారం చేస్తున్నవారి దగ్గర గణాంకాలు ఉంటే చెప్పాలన్నారు. సీఐఐ. నాస్కామ్ నివేదికల ప్రకారంలో దేశంలో ఉద్యోగాల కల్పన గణనీయంగా పెరుగుతోందన్నారు. ఏడాదికి దాదాపు 1.25 కోట్ల కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతోందన్నారు. ముద్ర యోజన కింద ఎంతోమంది ఉపాధి పొందుతున్నారన్నారు.
పెద్ద నోట్ల రద్దు తరువాత చలామణిలో ఉన్న సొమ్ములో 99.30 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చేసిందన్నది వాస్తవం! మరి, ప్రధానమంత్రి చెప్తున్నట్టు రూ. 1.30 కోట్లు ఎక్కడ స్వాధీనం చేసుకున్నారు..? చలామణిలో ఉన్న సొమ్మంతా బ్యాంకులకు తిరిగి వచ్చేస్తే…. నల్లధనం ఉన్నట్టా లేనట్టా..? ఉద్యోగాలు పోయాయనడానికి లెక్కలున్నాయా అని ప్రధాని ప్రశ్నించడం మరీ హాస్యాస్పదం. పెద్ద నోట్ల రద్దు తరువాత చిన్న, మధ్య తరహా వ్యాపారులు పెద్ద ఎత్తున నష్టపోయారు. చిన్నచిన్న పెట్టుబడులకు కూడా చేతిలో సొమ్ము లేక, బ్యాంకులకు వెళ్తే డబ్బులు దొరక్క నానా అవస్థలుపడ్డారు. బ్యాంకుల క్యూ లైన్లలో మరణించినవారి మాటేంటి..? ఇవన్నీ మోడీ ఇప్పుడు మాట్లాడరు లెండి, ఎందుకంటే ఎన్నికలు కదా! ఒకవేళ నోట్ల రద్దు నిర్ణయం అద్భుతమైన ఫలితాలను సాధించింది అనుకుంటే… ఎన్నికల ప్రచారంలో దాని గురించి ఎందుకు ప్రస్థావించడం లేదు..?