సోషల్ మీడియా నుంచి వైదొలగాలనుకుంటున్నట్లుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ .. సోషల్ మీడియాలోనే చేసిన ప్రకటన .. నెటిజన్లకు పజిల్‌గా మారింది. ఇంత హఠాత్తుగా.. మోడీకి సోషల్ మీడియాపై అంత వైరాగ్యం ఎందుకొచ్చిందన్నదే చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్న విషయం. మోడీ పెట్టిన ట్వీట్ కింద.. వచ్చిన కామెంట్లతో 70 శాతం వరకూ.. అదే సందేహం వ్యక్తం చేస్తున్నవే. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు నరేంద్రమోడీ. ఆయన తరపున ప్రత్యేక టీం.. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వ్యవహారాలు చూస్తూంది. అయితే.. ఆయన మాత్రం.. అంతా వారిపైనే వదిలి పెట్టరు. ప్రతీ రోజు ఉదయం.. కాలకృత్యాల పనులైపోయిన తర్వాత దాదాపుగా గంట సేపు.. సోషల్ మీడియాను పరిశీలస్తారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్యూలో చెప్పారు కూడా.
సోషల్ మీడియా ట్రెండ్స్ ద్వారా.. యువత అభిరుచుల్ని మోడీ అర్థం చేసుకుంటారు. వారి రాజకీయ ఆలోచనలపైనా అవగాహనకు వస్తారు. సోషల్ మీడియా ఉపయోగం ఎలా ఉంటుందో.. దాని వల్ల వచ్చే ప్రయోజనాలు ఎలా ఉంటాయో.. నరేంద్రమోడీకి తెలియనిది కాదు. ఒకప్పుడు.. గోద్రా వంటి బ్లాక్ ఇమేజ్ తో ఉన్న మోడీని.. సోషల్ మీడియానే… ఒక్క సారిగా.. భారతదేశ బలమైన నాయకుడిగా మార్చిందంటే అతిశయోక్తి కాదు. మోడీ.. గుజరాత్ నుంచి దేశం మొత్తం సోషల్ మీడియా ద్వారానే విస్తరించారు. అలాగే బీజేపీకి కూడా. ఫేస్ బుక్‌లో నెంబర్ వన్ మోడీ. ఆయనకు 4.45కోట్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు. మరెవరికీ ఇంత లేదు. ట్విట్టర్లో 53.3 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 35.2మిలియన్లు, యూట్యూబ్‌లో 4.5 మిలియన్ల సబ్‌స్కైబర్లు ఉన్నారు.
ఇంత భారీ ఫాలోయింగ్ ఉన్న మోడీకి.. సోషల్ మీడియాపై హఠాత్తుగా ఎందుకు వైరాగ్యం పుట్టిందో.. ఆయన ప్రకటిస్తేనే తెలుస్తుంది. సోషల్ మీడియా వల్ల.. ఫేక్ న్యూస్ ఎక్కువగా ప్రచారం అవుతున్నాయని… దేశ యువత.. వాటికి బానిసలుగా మారి.. భవిష్యత్ ను చెడగొట్టుకుంటున్నారని..ఆయన భావిస్తున్నారేమో కానీ.. ఆయన ప్రకటిస్తేనే తెలుస్తోంది. అయితే.. మోడీ..సోషల్ మీడియా నుంచి వెళ్లిపోయే విషయంలో నెటిజన్ల స్పందన కోసమే.. ఈ ప్రకటన చేశారని.. ఆయన సోషల్ మీడియాలోనే ఉంటారని చాలా మంది నమ్ముతున్నారు.
This Sunday, thinking of giving up my social media accounts on Facebook, Twitter, Instagram & YouTube. Will keep you all posted.
— Narendra Modi (@narendramodi) March 2, 2020