ప్రధానమమంత్రి నరేంద్రమోడీ జాతినుద్దేశించి మరోసారి ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. లాక్ డౌన్ పై ఏం చేయాలన్నదానిపై చర్చలు జరిపారు. మెజార్టీ ముఖ్యమంత్రులు లాక్ డౌన్ పొడిగింపు వైపే మొగ్గు చూపారు. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాత్రం.. మొత్తం ఎనిమిది అంశాలను చర్చకు పెట్టారు. అన్నీ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉన్నవే. ఈ నేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
లాక్ డౌన్ కొనసాగిస్తున్నట్లుగా ప్రకటించి… మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికి 70వేలకు చేరుకున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రమాదకరంగా నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో లాక్ డౌన్‌ను పూర్తి స్థాయిలో సడలిస్తే.. ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని అంచనా వేస్తున్నారు. జూన్, జూలైలలో.. దేశంలో కరోనా కేసులు పీక్ స్టేజ్‌కు చేరుకుంటాయని చెబుతున్నారు. అందుకే.. ఆర్థిక వ్యవస్థ మెరుగు కోసం కాస్త రిలాక్సేషన్స్ ఇచ్చినా… లాక్ డౌన్ మత్రం కొనసాగించే అవకాశం ఉందంటున్నారు.
మొన్న లాక్ డౌన్ పొడిగించే నిర్ణయం తీసుకున్నప్పుడు.. ప్రధానమంత్రి సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కానీ… జాతినుద్దేశించి ప్రసంగించలేదు. ఈ సారి మాత్రం ప్రసగించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే రైళ్లను పరిమితంగా నడపడం ప్రారంభించారు. రాను రాను వాటి సంఖ్యను పెంచే అవకాశం ఉంది. దేశీయ విమానాల రాకపోకలనూ ప్రారంభించబోతున్నారు. అదే సమయంలో వలస కూలీలను స్వస్థలాలకు చేర్చే మిషన్ కూడా నడుస్తోంది. వీటన్నింటిపై ప్రధానమంత్రి… ప్రజలకు వివరించే అవకాశం ఉంది.