HCU భూముల వివాదంలో బీజేపీ అగ్రెసివ్ స్టాండ్ తీసుకోలేదన్న విమర్శలు మొదటి నుంచి వినిపించాయి. కేంద్రం పరిధిలోని వర్సిటీ అయినప్పటికీ బీజేపీకి చెందిన నేతలు తీరిగ్గా తేరుకున్నారని బీఆర్ఎస్ విమర్శించింది. ఈ భూముల వేలం కోసం రేవంత్ కు ఓ బీజేపీ ఎంపీ సహకరించారని కేటీఆర్ ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్న సమయంలో HCU ఇష్యూపై ప్రధాని మోడీ స్పందించారు.
కంచ గచ్చిబౌలి అంశంపై హర్యానాలో ప్రధాని మాట్లాడుతూ.. అడవులపై బుల్డోజర్లు పంపడంలో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ బిజీగా ఉందని విమర్శించారు. ప్రకృతి నాశనం, వన్యప్రాణులకు హాని.. ఇదే కాంగ్రెస్ పాలన విధానం అన్నారు. అటవీ సంపదను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
అయితే , HCU భూవివాదం కొనసాగుతున్నప్పుడు , విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నప్పుడు కేంద్రం స్పందించలేదు. సంబంధిత మంత్రిత్వ శాఖ కూడా రియాక్ట్ అవ్వలేదు. కానీ, ఎక్కడో హార్యానాలో జరిగిన సభలో ప్రధాని మోడీ తెలంగాణలోని రేవంత్ సర్కార్ పై విమర్శలు చేయడంపై చర్చ జరుగుతోంది.
హర్యానాలోనూ బీజేపీ ప్రభుత్వమే ఉంది..అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసేందుకుగాను రేవంత్ సర్కార్ పై విమర్శలు చేసి ఉండవచ్చునని అంటున్నారు. ఏదీ ఏమైనా.. చాలా ఆలస్యంగా ఈ వివాదంపై మోడీ స్పందించారని బీఆర్ఎస్ మండిపడుతోంది.