మణిపూర్‌లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన మూక వీడియోలు ప్రపంచం ముందు భారత్ ఇమేజ్ను అనాగరికం అనే ముద్ర వేసేలా చేశాయి. అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది తెలుసుకుంటే… పాలకులు ప్రజల పట్ల ఇంత బాధ్యతా రాహిత్యంగా ఉండగలరా అని ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం ప్రపంచం అలాగే ఉంది.
రిజర్వేషన్ల పేరుతో రాజకీయాలు పెట్టిన చిచ్చుతో మణిపూర్‌లో జాతుల మధ్య సంఘర్షణ జరుగుతోంది. ఇది మూడు నెలలుగా జరుగుతున్నా … వందల మంది చనిపోతున్నా కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదు. స్పందిస్తే ఇలాంటి సమస్య ఉందని ప్రపంచానికి తెలుస్తుందని.. ప్రజల్లో మరింత చర్చ జరుగుతుందని అనుకున్నారేమో కానీ ప్రధాని మోదీ ఎప్పుడూ మణిపూర్ అంశాన్ని సీరియస్ గా తీసుకోలేదు. ఫలితంగా రావణకాష్టంలా మణిపూర్ రగులుతూనే ఉంది. చివరికి ప్రాణాలు తీయడంతో పాటు.. చివరికి మహిళల్ని ఇలా నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారాలు చేసే పరిస్థితికి తీసుకు వచ్చింది.
ఇప్పుడు ఈ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ప్రధాని మోదీ ఒక్క సారిగా ఫైర్ అయ్యారు. తనకు మాత్రమే సాధ్యమైన బేస్ వాయిస్ తో ఎవర్నీ వదిలి పెట్టబోమని హెచ్చరించారు. ఆ వీడియోలు తీసేయాలని సోషల్ మీడియా సంస్థల్ని కేంద్రం హెచ్చరించింది. ట్విట్టర్‌పై మండిపడింది. అయితే అసలు సమస్యను మాత్రం గుర్తించారో లేదో స్పష్టత లేదు. మణిపూర్ సమస్యపై ముందుగానే దృష్టి పెట్టి ఉంటే.. ఇలాంటి ఘోరం జరిగేది కాదు కదా అంటే.. ఒక్కరూ స్పందించరు.
దేశంలో బలమైన నాయకత్వం అని ప్రచారం చేసుకుంటారు కానీ.. సమస్యలు వస్తాయి అవే సద్దుమణిగిపోతాయని నిమ్మకు నీరెత్తి ఉండటం మాత్రం.. బలమైన నాయకత్వం కాదు. ఘోరమైన నాయకత్వం. మణిపూర్ ఘటన తర్వాత ఎక్కువగా ఇలాగే అనిపిస్తే అందులో తప్పేం ఉండదు.