భారతీయ జనతా పార్టీ నేతలు ఇటీవలి కాలంలో… ఆంధ్రప్రదేశ్‌లో కింగ్ మేకర్లం అవుతామనే ప్రకటనలు చేస్తున్నారు. ఎవరితోనూ పొత్తులు ఉండవని.. ఒంటరిగా పోటీచేసి.. గణనీయమైన స్థానాలు పొందుతామని చెప్పుకొస్తున్నారు. ఇలాంటి వాదన వినిపించేవారిలో.. ఏపీ బీజేపీకి పెద్ద దిక్కుగా మారిపోయిన జీవీఎల్ నరసింహారావు ప్రధానంగా ఉన్నారు. ఆయన ఏపీలో బీజేపీ బలపడిందని… తమ ప్రమేయం లేకుండా.. ప్రభుత్వాలు ఏర్పడవని అనడం ప్రారంభించారు.
ఏపీలో కింగ్ మేకర్లం అవుతామంటున్న బీజేపీ నేతలు..!
ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి కనీస సీట్లు వచ్చే పరిస్థితే ఉంటే.. ఈ జీవీఎల్ నరసింహారావు ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా ఎందుకు ఎన్నికవడం..? భాషకాని భాష, ప్రాంతం కాని ప్రాంతం నుంచి.. ఎంపీగా ఎన్నికయ్యే బదులు.. సొంత రాష్ట్రం నుంచి ఆయన ఎంపీగా ఎన్నిక కావొచ్చు కదా..! ఆయన ఎంపీ కావాలని నేను కూడా కోరుకున్నాను. కానీ ఆయన సొంత రాష్ట్రం నుంచి ఎంపీ అయి ఉంటే బాగుండేది కదా..! ఉత్తరప్రదేశ్ నుంచి జీవీఎల్, కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్, టీడీపీతో మాట్లాడుకుని.. సురేష్ ప్రభును రాజ్యసభకు పంపే బదులు.. తమ బలంతో ఏపీ నుంచే పోటీ చేసి విజయం సాధించవచ్చు కదా..! అంత ఎందుకు కింగ్ మేకర్లు అయిపోతున్నారు కాబట్టి.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ సారి ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేస్తే ఇంకా బాగుంటుంది కదా..! విజయవాడ, ఏలూరు లాంటి సీట్లలో కాకపోయినా.. బీజేపీ సిట్టింగ్ సీటు.. విశాఖ నుంచి ప్రధానమంత్రి మోడీని పోటీ చేయమనవచ్చు కదా..! లేకపోతే అమిత్ షా అయినా.. పోటీ చేయవచ్చు కదా.? ఏపీకి అన్నీ చేశామంటున్నారు కాబట్టి.. పోటీ చేయడానికి ఇబ్బంది ఏమిటి..? కింగ్ మేకర్లు అవుతున్నారు కాబట్టి పోటీ చేయడానికి భయం ఎందుకు..?
ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీకి మోడీ సిద్ధపడతారా..?
ఈ విషయాన్ని నేను సీరియస్‌గానే అంటున్నారు. ఎందుకంటే.. నరేంద్రమోడీ.. ప్రస్తుతం వారణాశి ఎంపీగా ఉన్నారు. ఆయన గుజరాత్ కు చెందిన వారు. అయినప్పటికీ వారణాశి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు కాబట్టి.. ఏపీలో కూడా పోటీ చేసే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీని విమర్శకులు ఉత్తరాది పార్టీ అంటున్నారు. వింధ్యా పర్వతాలకి దక్షిణాదిన కూడా.. బీజేపీ ఉందని నిరూపించుకోవడానికి మోడీ ఏపీలో పోటీ చేయడం ఉపయోగకరం అవుతుంది. అలాగే ఇప్పటికే కింగ్ మేకర్లం అంటున్నారు.. మోడీ పోటీ చేస్తే ఆ ప్రభావంతో ఏకంగా కింగే కావొచ్చు. అదే సమయంలో.. మోడీ నేరుగా.. విజయవాడ, విశాఖల్లో ఏదో ఓ స్థానం నుంచి పోటీ చేసి.. ఆయనపై చంద్రబాబునే పోటీ చేయమని.. సవాల్ చేయవచ్చు. చంద్రబాబు వర్సెస్ మోడీ అన్నట్లుగా తేలిపోతుంది. లక్షల కోట్లు ఇచ్చామంటున్న బీజేపీ.. అసలేమీ ఇవ్వలేదంటున్న టీడీపీ… ఇలా ముఖాముఖి తలపడితే.. ప్రజాతీర్పు తేలిపోతుంది కదా.. !
మోడీ, చంద్రబాబు, జగన్ ఒకే స్థానంలో పోటీ చేస్తే ప్రజాతీర్పు తేలిపోతుందా..?
చంద్రబాబు, నరేంద్రమోడీ ముఖాముఖి.. విజయవాడ పార్లమెంట్ స్థానంలోనే.. విశాఖ నుంచో పోరాడితే ప్రజాతీర్పు తెలుస్తుంది. మోడీ ఏపీకి .. దేశంలో ఏ రాష్ట్రానికీ ఇవ్వనంత సాయం చేస్తే.. ఆయనే గెలుస్తారు. ఏమీ ఇవ్వలేదంటున్న చంద్రబాబు వాదన నిజమైతే ఆయన గెలుస్తారు. మన దేశంలో ప్రజాభిప్రాయసేకరణలు లేవు కాబట్టి… ఎన్నికలే ప్రజాతీర్పును నిర్ణయిస్తాయి. ప్రజల అభిప్రాయం ఎన్నికల ద్వారానే స్పష్టమవుతుంది. అదే సమయంలో … ఈ తీర్పు ద్వారా ఇతర పార్టీలు కూడా… తమ నిర్ణయాన్ని తీసుకునేందుకు అవకాశం ఉంది. ఒక వేళ ఇద్దరూ మోసం చేసినట్లు ప్రజలు భావిస్తే.. అలాంటి వాదనే వినిపిస్తున్న.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా.. వారిపై పోటీ చేస్తే… ఆయనను గెలిపిస్తారు. అందుకే… ఏపీ ప్రయోజనాల విషయంలో… ఈ ముగ్గురూ… ఒకే లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలి. అప్పుడే ప్రజాతీర్పు తేలిపోతుంది.