ప్రధాన మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి జాగ్రత్తగా మాట్లాడాలి. ఆచితూచి మాట్లాడాలి. లెక్కలు చెప్పేటప్పుడు పక్కాగా ఉండాలి. ఒకటికి రెండుసార్లు రూఢి చేసుకోవాలి. నరేంద్ర మోడీ మాత్రం తరచూ ఈ జాగ్రత్తలు పాటించకుండా నోటికొచ్చింది మాట్లాడుతుంటారు. అది ఎందుకు తప్పో నిరూపిస్తూ, సమాధానం చెప్పాలని ఎవరైనా అడిగితే మూగనోము పడతారు.
కేరళలోని ఎస్టీ కుటుంబాల్లో శిశు మరణాలు సోమాలియాలను తలపిస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఇది చాలా తీవ్రమైన విషయం. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏదో ఫ్లోలో అన్నారో నిజంగా అనాలనే విమర్శ చేశారో గానీ ఇది దుమారం రేపింది. మోడీపై ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ప్రధాన మంత్రి మాట్లాడేటప్పుడు గణాంకాలను సరిగ్గా చూసి మాట్లాడాలని, మోడీ తమ ప్రభుత్వం మీద అభాండం వేశారని దుయ్యబట్టారు. అసలు ఏ గణాంకాల ఆధారంగా ఈ ఆరోపణ చేశారని ప్రశ్నించారు. కేరళను అవమానించేలా మాట్లాడినందుకు మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. షరామామూలుగా మోడీ మౌనం వహించారు.
వాస్తవాలు, గణాంకాల విషయంలో తప్పులో కాలు వేయడం మోడీకి అలవాటే. చివరకు, పొరుగు దేశాధ్యక్షుడి పుట్టిన రోజు విషయంలోనూ పొరపాటు పడ్డారు. చాలా అడ్వాన్స్ గా బర్త్ డే విషెస్ చెప్పారు.
బీహార్ ఎన్నికలు కాస్త ముందు ఇలాగే కామెంట్ చేసి విమర్శల పాలయ్యారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ డి.ఎన్.ఎ.లో ఏదో తేడా ఉందని తీవ్రమైన విమర్శ చేశారు. ఈ కామెంట్ చేసిన కొన్ని రోజులకే ఎన్నికల ప్రచారం మొదలైంది. ఆ ఎన్నికల ఘట్టంలో ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. నితీష్ పార్టీ జేడీయూ దీన్ని ఒక ఎన్నికల అంశంగా మార్చి మోడీపై తీవ్రంగా విమర్శల దాడి చేసింది. ఆ ఎన్నికల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోవడానికి, మోడీ చేసిన ఈ అనాలోచిత వ్యాఖ్య కూడా ఓ కారణంగా కనిపించింది.
దేశంలో కేరళకు ప్రత్యేక స్థానం ఉంది. నూరు శాతం అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా ఖ్యాతి పొందింది. విద్యాధికులు, మేధావులు ఉన్న కేరళలో చైతన్యం ఎక్కువంటారు. వైద్య సేవల్లోనూ మరీ సోమాలియాతో పోల్చ తగినంత దరిద్రమైన పరిస్థితులు ఉన్నాయా అనేది అనుమానించాల్సిన విషయం. అలాంటి పరిస్థితి లేనేలేదని ముఖ్యమంత్రి బల్లగుద్ది చెప్తున్నారు. మోడీ క్షమాపణకు డిమాండ్ చేస్తున్నారు. కానీ, ఇలాంటప్పుడు మౌనమె నీ భాష ఓ మూగ మనసా అనే పాటను గుర్తు చేసుకుంటారో ఏమో, మౌనంగా ఉండటం మోడీకి అలవాటే.