ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అప్పుడప్పుడు.. వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకుని… వివిధ రాష్ట్రాల కార్యకర్తలతో మాట్లాడుతూ ఉంటారు. అలా అదివారం.. తమిళనాడు కార్యకర్తలతో మాట్లాడారు. అక్కడి రాజకీయాలు.. అక్కడి కూటములు.. రజనీకాంత్, కమల్ హాసన్ పార్టీల గురించి చర్చించుకోవడానికి చాలా ఉంది. రాజకీయాలు కాకపోతే.. కేంద్రం తరపున తమిళనాడుకు ఏం చెశారో చెప్పుకుని.. కనీసం నోటాకు మించి ఓట్లను తెచ్చుకునే వ్యహాలు రూపొందించుకోవచ్చు. కానీ.. మోడీ మాత్రం… ఎన్టీఆర్ గురించి.. టీడీపీ గురించి చెప్పుకొచ్చారు.
తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం స్వర్గీయ ఎన్ టీ రామారావు పోరాడారని తమిళనాడు బీజేపీ కార్యకర్తలకు మోడీ ఓ పాఠంలా చెప్పుకొచ్చారు. పొరుగు రాష్ట్రానికి చెందిన… రాజకీయ ప్రముఖుడు గురించి.. తమకెందుకు చెబుతున్నారో బీజేపీ నేతలకు అర్థం కాలేదు. కానీ.. అది వీడియో కాన్ఫరెన్స్.. చెప్పేది వినడం తప్ప… ఎదురు మాట్లాడే చాన్స్ ఉండదు. చాన్స్ ఉన్నప్పటికీ.. మాట్లాడే అవకాశం రాదు కూడా. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని.. కాంగ్రెస్ దాష్టీకాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఎన్టీఆర్ పోరాడారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ దాష్టీకాలకు వ్యతిరేకంగా ఏర్పాటైన టీడీపీ అదే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటోందని విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తెలుగుదేశం పార్టీ మహా కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తోందని అందుకు కాంగ్రెస్తో జత కడుతోందని.. విమర్శించారు. రాజవంశీకులు, సంపన్నులు ఓ సంఘంగా ఏర్పడ్డారని, వీరి కూటమి ఓ గందరగోళ కూటమి అని ఎద్దేవా చేశారు.
ఇంకా చాలా విమర్శలు చేశారు కానీ… తమిళ కార్యకర్తలకు.. మోడీ ఇదంతా తమకు ఎందుకు చెబుతున్నారో మాత్రం అర్థం కాలేదు. ఏపీలో బీజేపీ కార్యకర్తలకు చెప్పుకుంటే.. ఏమైనా ప్రయోజనం ఉంటుంది కానీ… తమిళనాడులో అంతంత మాత్రం ఉనికి ఉన్న కాంగ్రెస్… అసలు పోటీ చేసే అవకాశం లేని.. టీడీపీ గురించి ఎందుకు చెబుతున్నారో అర్థం చేసుకోలేకపోయారు. ఏపీ బీజేపీ కార్యకర్తలకు చెబితే..ఇక్కడ టీడీపీ నేతలు సమాధానం ఇస్తారు.. కానీ తమిళనాడు కార్యకర్తలకు ఏం చెబుతారు..! చివరిగా బీజేపీ నేతలకు మాత్రం..ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. మోడీ.. ఏపీ బీజేపీ కార్యకర్తలతో మాట్లాడే స్క్రిప్ట్ ను.. తమిళనాడు కార్యకర్తలతో మాట్లాడేందుకు తెచ్చుకున్నారనేది..ఆ క్లారిటీ. జరిగింది చూస్తూంటే.. అది నిజమేననిపిస్తోంది….!