ప్రధాని మోదీ ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన విశాఖ పర్యటనకు రాబోతున్నారు. ఆయన విశాఖకు ఎవరూ ఊహించని వరాలు ప్రకటించే అవకాశం ఉంది. సాయంత్రం 4.30 గంటలకు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ వేదిక నుంచి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్టీపీసీ నిర్మించే గ్రీన్ హైడ్రోజన్ హబ్, రైల్వే జోన్లతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం రూ.85 వేల కోట్ల పెట్టుబడితో 25 వేల మందికి ఉపాధి లభించే ఈ ప్రాజెక్టుతో విశాఖ ప్రతిష్ట మరింత పెరగనుంది. రైల్వే జోన్ భవన్ నిర్మాణానికి టెండర్లు కూడా పిలిచారు.
అంతే కాదు తాజాగా దేశలో నాలుగు సిటీల్ని గ్రోత్ హబ్‌గా నిర్ణయించింది. అందులో విశాఖ ఒకటి. విశాఖను గ్రోత్ హబ్‌గా ప్రకటించిన కేంద్రం.. ఆ మేరకు కార్యాచరణను ప్రకటించనుంది. విశాఖపట్నంలో నీతి ఆయోగ్ 2 దఫాలు పలు జిల్లాల కలెక్టర్లు, ముఖ్య అధికారులు, అనుబంధ రంగాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించింది. పెట్రో రసాయన, రసాయన విభాగం, విద్య, ఫార్మా, ఐటీ , టెక్స్టైల్, పర్యాటకం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, మత్స్య సంబంధ పరిశ్రమలు, ఇంజినీరింగ్ గూడ్స్, లాజిస్టిక్స్, పోర్టు సంబంధిత కార్యకలాపాలు, రియల్ ఎస్టేట్, భవన నిర్మాణ రంగాలను ఈ హబ్‌లో భాగంగా అభివృద్ది చేయనున్నారు.
ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విశాఖ మెట్రో గురించి కూడా ప్రధాని మోదీ ప్రకటన చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల మెట్రో పాలసీని ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. ఆ ప్రకారం.. కేంద్రం ప్రతి రాష్ట్రానికి ముఖ్య నగరంలో మెట్రోను ప్రకటిస్తోంది. అలా విశాఖకూ ప్రధాని మోదీ మెట్రోను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా మోదీ టూర్ విశాఖకు అనేక కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి వేదిక కాబోతోంది.