లాక్డౌన్ కొనసాగింపుపై నరేంద్రమోడీ ఆదివారం ప్రకటన చేస్తారని అందరూ అనుకున్నారు కానీ.. ఎలాంటి ప్రకటన రాలేదు. లాక్డౌన్ కొనసాగించే విషయంలో కేంద్రం తర్జన భర్జన పడుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మూడు వారాల లాక్‌డౌన్‌కే ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. వృద్ధి రేటు మైనస్‌లోకి పోతుందన్న అంచనాలు వస్తున్నాయి. నిరుద్యోగం పెరిగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి మరో రెండు వారాలు కొనసాగిస్తే.. మరింత దారుణంగా ఉంటుందని కళ్ల ముందు కనిపిస్తూండటంతో.. పాక్షిక సడలింపులపై కేంద్రం కసరత్తు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. జోన్ల వారీగా లాక్డౌన్ అమలు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్రాన్ని కోరారు.
రెడ్ జోన్లలో మాత్రం పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించి… ఆరెంజ్, గ్రీన్ జోన్లలో సడలింపులు ఇవ్వాలని సూచించారు. కేంద్రం కూడా ఇప్పుడు ఇదే ఆలోచన చేస్తోంది. దేశంలోని సగం జిల్లాల్లో మాత్రమే.. వైరస్ వ్యాపించింది. సగం జిల్లాల్లో అసలు కేసులు నమోదు కాలేదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. ఏప్రిల్ 15 నుంచి దేశాన్ని మూడు జోన్లుగా విభజించే దిశగా కేంద్రం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా గుర్తించి లాక్ డౌన్ నిబంధనలు అమలు చేసే అవకాశం ఉంది. జిల్లాల్లో 15కంటే ఎక్కువగా నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్‌గా గుర్తించి.. పూర్తి స్థాయిలో లాక్డౌన్ ఆంక్షలు అమలు కొనసాగిస్తారు. జిల్లాలో 15 కంటే తక్కువ కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను ఆరెంజ్ జోన్లుగా గుర్తించి.. పరిమిత కార్యకలాపాలకు అనుమతి ఇస్తారు.
ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని జిల్లాలను గ్రీన్ జోన్లుగా గుర్తించి.. పూర్తి స్థాయిలో కార్యకలాపాలకు అనుమతి ఇస్తారు. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ జిల్లాల్లో ఎలాంటి పనులకు అనుమతి ఉంటుంది.. ఎలాంటి వాటికి ఉండదు అన్నదానిపై ఓ జాబితాను కేంద్రం రూపొందిస్తోంది. లాక్ డౌన్ కొనసాగింపు ప్రకటనతో దీన్ని ప్రకటించే అవకాశం. సంపూర్ణ లాక్ డౌన్ వల్ల.. నిత్యావసర వస్తువులు.. ఇతర పారిశ్రామిక ఉత్పత్తి పై .. కేంద్రం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కొన్నింటికి అనుమతులు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. వీటన్నింటిపై నేడో రోపే నిర్ణయం తీసుకోనుంది. అయితే.. ఏపీ సీఎం జగన్.. ఏపీలో మండలాల వారీగా రెడ్ జోన్లను గుర్తించారు. ఆ ప్రకారం.. ఏపీలో 37 మండలాలు మాత్రమే లాక్ డౌన్ అవుతాయి. కానీ కేంద్రం జిల్లాలను యూనిట్‌గా చేసుకుంటోంది. ఆ ప్రకారం.. పది జిల్లాల్లో అమలు చేయాల్సి వస్తుంది.