ఆరెస్సెస్ నుంచి బీజేపీకి వెళ్లి.. కీలకంగా వ్యవహరిస్తున్న రామ్‌మాధవ్ తీరుపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ అసంతృప్తిగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆయన సొంతంగా భారత్ ఫౌండేషన్ అనే సంస్థను నడుపుతున్నారు. దానికి సంబంధించిన వారిని… బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు సలహాదారులుగా నియమించుకున్నారు. ముఖ్యంగా.. ఈశాన్య రాష్ట్రాలకు రామ్‌మాధవ్ ఇన్చార్జ్గా ఉన్నారు. అక్కడ బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ ప్రభుత్వాలన్నింటికీ.. వేర్వేరుగా.. తన భారత్ ఫౌండేషన్‌కు చెందిన వారిని సలహాదారులుగా నియమించుకున్నారు. ప్రభుత్వ జీతభత్యాలు పొందుతున్నారు. వారి ద్వారా పాలనలో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు కూడా బలంగా వస్తున్నాయి. దీంతో బీజేపీలో రామ్‌మాధవ్ తీరుపై చర్చ ప్రారంభమయింది.
గతంలో రామ్‌మాధవ్… జమ్మూకశ్మీర్‌కు కూడా ఇన్చార్జ్గా ఉండేవారు. ఆయన దెబ్బకు.. అక్కడ బీజేపీ తుడిచి పెట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. చివరికి..ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకుని… అనూహ్యమైన స్టెప్ వేయాల్సి వచ్చింది. అంతకు ముందే రామ్‌మాధవ్‌ను జమ్మూకశ్మీర్ బాధ్యతల నుంచి తప్పించారు. ఈశాన్య రాష్ట్రాలకే పరిమితం చేశారు. నిజానికి అప్పట్లోనే… ఆయన అమిత్ షా తర్వాత బీజేపీ అధ్యక్షుడవుతారన్న ప్రచారం జరిగింది. కానీ.. అంత అవకాశం లేదని.. ఆయన పనితీరుతో తేలిపోయింది. ఇప్పుడు.. కనీసం కేంద్ర కేబినెట్లో బెర్త్ అయినా దొరుకుతుందేమోనని ఆశ పడుతున్నారు. దాని కోసం ఆరెస్సెస్ వైపు నుంచి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. దాదాపు ఓకే అనుకున్నారు. కానీ ఇప్పుడు.. షాకివ్వబోతున్నట్లుగా చెబుతున్నారు.
అయోధ్య రామాలయం భూమిపూజ పూర్తయిన తర్వాత వారం రోజుల్లో… కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనుంది. మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని మార్చడానికి సహకరించిన జ్యోతిరాధిత్య సింధియాతో పాటు మరికొంత మందిని చేర్చుకోబోతున్నారు. ఈ బ్యాచ్‌లో తానుంటానని రామ్ మాధవ్ ఆశ పడ్డారు. అయితే.. ఆయనకు చాన్స్ లేదని.. తేల్చేసినట్లుగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి ఏపీ వ్యవహారాలన్నింటినీ తానే చూసుకుంటున్నారని.. విధానాలను ఆయనే డిసైడ్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న వాటికి రామ్‌మాధవే కారణం అని తేలితే.. పార్టీలో ఆయన ఇమేజ్ మరింత మసకబారవచ్చని అంటున్నారు.