ప్రధాని మోదీ జనవరి ఎనిమిదో తేదీన ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్టిపిసి, ఏపీ జెన్కో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లి లో మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. రెండు ప్రాజెక్టులు ప్రభుత్వానికి .. మూడో ప్రాజెక్టు ప్రైవేటుది. ఆర్సెలార్ మిట్టల్ సంస్థ అతి పెద్ద స్టీల్ ప్లాంట్ను అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేస్తోంది. రెండు విడతల్లో లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టనుంది. ఈ ప్రాజెక్టును తీసుకు రావడానికి చంద్రబాబు,లోకేష్ సైలెంటుగా చాలా ప్రయత్నాలు చేశారు.
పూడిమడకలో ఎన్టిపిసి నిర్మించే గ్రీన్ హైడ్రోజన్ హబ్ ను 85 వేల కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 25 వేల మందికి ఉపాధి లభించనుంది. విశాఖపట్నం ప్రతిష్ట కూడా మరింత పెరగనుంది. ఇప్పటికే విశాఖను గ్రోత్ హబ్ గా ప్రకటించిన కేంద్రం.. దానికి సంబంధించి కార్యాచరణ చేపట్టింది. మరోవైపు ఏపీ ప్రజలకు పదేళ్లుగా ఊరిస్తూ వస్తున్న రైల్వే జోన్ కు కూడా ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఉమ్మడి ఏపీ విభజన చట్టంలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటించారు. అయితే పదేళ్లు దాటుతున్న ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.
ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడం, ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామ్యం కావడంతో కదలిక వచ్చింది. ప్రధాని రేంజ్ లో ఉమ్మడి విశాఖ టూర్ ను నిర్వహించేందుకు ఎంపీ సీఎం రమేష్ ప్రత్యేకంగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రధాని మోదీ మరికొన్ని ప్రాజెక్టులను కూడా ఉత్తరాంధ్రకు ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.