ఎడతెగని ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో శుక్రవారం భేటీ కాబోతున్నారు. చాలా కాలంగా ప్రతిపక్ష ప్రభుత్వ ప్రతినిధి వర్గాలను కలుసుకునే అవకాశం ఇస్తున్న మోడీ చంద్రబాబును మాత్రం కలవలేదు.ఆర్థిక మంత్రి ఆరుణ్జైట్లీతోనే ముఖ్యమంత్రి సంతృప్తి పడాల్సి వచ్చింది. నీటిపారుదల మంత్రి నితిన్ గడ్కరీ అయితే అనవసరంగా రావద్దని ఆయనపై ఆగ్రహించినట్టు కూడా బిజెపి వర్గాలు చెప్పేవి. గుజరాత్ ఎన్నికలలో బలం కోత, మిగిలిన చోట్ల కూడా ప్రతికూల సంకేతాల నేపథ్యంలో మోడీ కొంత సర్దుబాటుకు సిద్ధమైనట్టు కనిపిస్తుంది. చంద్రబాబుతో భేటీలో ప్యాకేజీ మొత్తాల విడుదల పోలవరం, నియోజకవర్గాల పెంపు వంటి అంశాలువస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రధాని ఎపికి సంబంధించిన కోర్కెలు అంగీకరిస్తారని అనుకూల వర్గాల కథనాలు నడుస్తున్నాయి.అయితే గత అనుభవాలను బట్టి చూస్తూ మోడీ నిర్దిష్టంగా ఏదీ చెప్పడం జరిగేది కాదు.సాధారణ హామీలు భరోసాలతో సరిపెట్టి పంపిస్తారు. మిగిలినవి మంత్రులు మాట్టాడి నిర్ణయిస్తారని చెబుతారు. రాజకీయంగా తమ మధ్య దూరం లేదని సంకేతాలు ఇవ్వడానికి తప్ప రాష్ట్రానికి ఏదో ఒరగబెట్టడం మిథ్య.