కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జాతకం ఏమిటో గానీ, ఆయన ఏం చేసినా ఎవరూ సీరియస్ గా తీసుకోరని పేరు. ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సహారా ఇండియా, బిర్లా కంపెనీల నుంచి మొత్తం 52 కోట్ల రూపాయల లంచాలు తీసుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇదొక వార్తగా న్యూస్ చానల్స్ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చాయి. కవరేజీ ఇచ్చాయి. అయితే ఒక ప్రధాన మంత్రిపై ఆరోపణలు వస్తే ప్రకంపనలు తీవ్రంగా ఉంటాయి. ఆ స్థాయిలో రాహుల్ ఆరోపణలను మీడియా సీరియస్ గా తీసుకోలేదు.
పైగా రాహుల్ గాంధీ సెల్ఫ్ గోల్ అంటూ ఆధారాలతో ప్రత్యేక కథనాలను ప్రసారం చేశాయి. రాహుల్ పేర్కొన్న డైరీలోనే ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్, కాంగ్రెస్ నాయకురాలు అంబికా సోని పేర్లు కూడా ఉన్నాయి. ఈ సంగతి ఆయనకు తెలుసో లేదో. పైగా ఈ డైరీలోని వివరాలు అనుమానాస్పదంగా ఉన్నాయి. లంచం ఇచ్చే వారు నెల రోజుల వ్యవధిలో 9 విడతల్లో 40 కోట్ల ఇచ్చినట్టు డైరీలో రాసిన తీరే అనుమానాలకు తావిస్తోంది. మిగతా నాయకుల విషయంలోనూ అంతే. కాబట్టే సీబీఐ అధికారులు మోడీతో పాటు కాంగ్రెస్ నేతలపైనా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ విషయంలో ఇంతకు ముందే సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రాహుల్ గాంధీ పేర్కొన్న వివరాలనే సాక్ష్యాధారాలుగా చూపించారు. అయితే వాటిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. అవి నమ్మశక్యంగా లేవని, పక్కా ఆధారాలుంటే చూపాలని ఆదేశించింది. ఇదంతా బహుశా రాహుల్ గాంధీకి తెలియదేమో. డైరీలో మోడీ పేరు కనిపించగానే ఆవేశంగా ఆరోపణ చేసేశారు. సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. అందుకే ఇంత తీవ్రమైన ఆరోపణను మీడియానే కాదు, ప్రజల్లోనూ చాలా మంది సీరియస్ గా తీసుకోలేదు. రాహుల్ వ్యవహార శైలి తెలిసిన కొందరైతే నవ్వుకున్నారు కూడా. తన పార్టీ నేతలు షీలా దీక్షిత్, అంబికా సోనీలను కూడా ఇబ్బందిపెట్టేలా, తమకే బూమరాంగ్ అయ్యేలా అనాలోచిత ఆరోపణలు చేయడంపై కొందరు కాంగ్రెస్ నేతలు కూడా ఆఫ్ ది రికార్డ్ గా ఆవేదన వ్యక్తం చేశారు.