ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలభై మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలను కూల్చి రాజకీయం చేసే దిశగా..మోదీ… ఆలోచనలు సాగడం మాత్రమే కాదు.. దాన్ని బహిరంగంగా చెబుతున్నారు కూడా. భారతీయ జనతా పార్టీ.. ప్రభుత్వాలను కబ్జా చేస్తుందని.. గత నాలుగైదేళ్లలో…జరిగిన అనే ఘటనలు నిరూపించాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిపోవడం దగ్గర్నుంచి… బీహార్‌లో అధికార పక్షానికి పార్టనర్‌గా మారడం వరకూ.. చాలా రాష్ట్రాల్లో బీజేపీ చేసిన రాజకీయం ఇప్పుడు కొత్త దారుల్లోకి వెళ్తోంది.
అరుణాచల్ మాజీ సీఎం ఆత్మహత్య చేసుకున్నది బీజేపీ టచ్‌తోనే..!
ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజార్టీ రాకపోయినప్పటికీ.. ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు… బీజేపీ అగ్రనేతలు వేసిన అడుగులు..కూడా… చాలా అనుమానాలు కలిగించాయి. అయితే .. ఎన్ని చేసినా… రాజకీయం దిగజారిందని.. చాలా మంది అనుకున్నారు కానీ…నేరుగా ప్రధానమంత్రి స్థాయిలో.. ప్రభుత్వాలను కూల్చేసే కుట్రలు జరుగుతాయని ఎవరూ ఊహించరు. 2014లో మోదీ ప్రధాని అయిన తర్వాత.. అమిత్ షా బీజేపీ అధ్యక్షుడయిన తర్వాత ఇలాంటి ఆపరేషన్లు ఊపందుకున్నాయి. ముందుగా ఈశాన్య రాష్ట్రాలను గురి పెట్టారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని… ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో చీలిక తెచ్చి కూల్చి వేశారు. కాంగ్రెస్ రెబల్ అయిన.. కలికోఫుల్ అనే ఎమ్మెల్యేను ముఖ్యమంత్రిని చేశారు. కానీ.. బీజేపీ అసలు లక్ష్యం వేరు కాబట్టి.. కలికోఫుల్ కూడా ఎక్కువ కాలం సీఎంగా ఉండలేకపోయారు. తనను పావుగా వాడుకుని చేసిన రాజకీయాన్ని తట్టుకోలేక కలికోఫుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన రాసుకున్న డైరీల్లో సంచలన విషయాలున్నాయి. అది సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. కానీ.. ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అదే మాదిరిగా మారాయి.
మళ్లీ గెలిస్తే.. కర్ణాటక, బెంగాల్, పంజాబ్.. ఏదీ మిగలదు..! అన్నీ “టచ్”లోకే..!
తృణమూల్ పై మోదీ బెదిరింపులతో పార్టీ ఫిరాయింపులను… ప్రొత్సహించడానికి.. తాము ఏ మాత్రం వెనుకాడబోమని..నేరుగా మోదీనే ప్రకటించినట్లయింది. తమకు నచ్చని ప్రభుత్వాలు ఉంటే… కూల్చివేస్తామని.. నేరుగా చెప్పినట్లయింది. ఇప్పటికే.. కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చడానికి.. బీజేపీ నేతలు.. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు వందల కోట్లు ఆఫర్లు ఇస్తూ.. ఆడియో టేపులతో అడ్డంగా దొరికిపోతున్నారు. ఎమ్మెల్యేలకు బేరాలు పెడుతున్న వారు కూడా.. మోదీ, అమిత్ షాల ప్రస్తావన తెస్తున్నారు. కర్ణాటక ఎపిసోడ్ అలా నడుస్తూండగానే.. మోదీ బెంగాల్ సర్కార్ పై.. కన్ను వేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ ప్రభుత్వాలు ఉంటాయో… ఊడిపోతాయా .. అన్నది కాదు.. అసలు రాజ్యాంగం కారణంగా ప్రధాని అయిన మోదీ.. అదే రాజ్యాంగాన్ని కాలదన్ని… ప్రజాభిప్రాయానికి విరుద్దంగా.. ప్రభుత్వాలను సైతం మార్చేందుకు వెనుకాడబోమని.. హెచ్చరించడమే… అసలు ప్రమాదం.
రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ఇప్పటికే “టచ్” చేసేశారు..!
దేశంలో వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుని.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మరీ పాలన సాగిస్తున్నారని.. విపక్షాలు చాలాకాలంగా ఆరోపిస్తున్నాయి. చివరికి.. ఎన్నికల సంఘం కూడా.. మోదీ కమిషన్ గా మారిపోయిందని… ఎన్నికలు జరుగుతున్న తీరుతోనే విమర్శలు వస్తున్నాయి. ఫిరాయింపు రాజకీయాలు.. ఎమ్మెల్యేల కొనుగోళ్ల గురించి బహిరంగంగా మాట్లాడినా.. ఈసీ నోరు మెదపడం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు అదే చెబుతున్నారు. ఎన్నికల కోడ్ విపక్ష పార్టీలు.. ఆయా పార్టీల ప్రభుత్వాలున్న చోట మాత్రమే.. అమలవుతోంది. మిగతా చోట్ల.. అధికార పార్టీ నేతలకు ఎలాంటి కోడ్ అడ్డంకులు రావడం లేదు. ఇలాంటి సమయంలో… నేరుగా మోదీ… ప్రభుత్వాలను కూల్చివేస్తామన్నట్లుగా మాట్లాడటం.. కలకలం రేపుతోంది. విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా..మోదీ మరో సారి గెలిస్తే.. ఇక దేశంలో ఎన్నికలు ఉండవని.. నియంతృత్వం వచ్చేస్తుందన్న విమర్శలకు బలం చేకూరుస్తోంది.