ఆంధ్రప్రదేశ్ లో ప్రతిరోజు జరుగుతున్న వివాదాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాస్తంత కటువుగా స్పందించినట్లు బీజేపీ నాయకులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఏపీలో రాజధాని వికేంద్రీకరణ పై ప్రధానికి లేఖ రాశారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ కు సమాధానమిచ్చారు. అదే సమయంలో తనను కలిసేందుకు వచ్చిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకుల వద్ద ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై కాస్తంత కటువుగా స్పందించినట్లు సమాచారం. అధికారంలోకి వచ్చి 9 నెలలు కూడా కాలేదని, ప్రమాణ స్వీకారం నుంచి నేటి వరకు ప్రతిరోజు ఏదో ఒక వివాదం చెలరేగుతోందని ప్రధానమంత్రి అసహనం వ్యక్తం చేసినట్లు కమలనాథులు చెబుతున్నారు. ఇసుక అమ్మకాల నిలిపివేత, రివర్స్ టెండరింగ్, పోలవరం పనులు ఆగిపోవడం, మూడు రాజధానుల నిర్ణయం, తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోవడం ఇలా అన్ని అంశాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ నాయకుల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. జగన్ కు పాలనలో అనుభవ రాహిత్యం ఉందని, కొన్నాళ్లకు తెలుసుకుంటారని తాము భావించామని, అయితే ఇందుకు భిన్నంగా రోజురోజుకు ఫిర్యాదులు ఎక్కువవుతున్నాయని ప్రధానమంత్రి అసహనం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డితో తమకు అంశాల వారీగా స్నేహ సంబంధాలు తప్ప రాజకీయంగా ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేసినట్లు సమాచారం. ఏపీలో జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను క్షేత్రస్థాయిలో ప్రజల దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్రంలో బీజేపీ బలపడేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులకు ప్రధాని నరేంద్ర మోడీ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.