స్టాట్యూ ఆఫ్ యూనిటీ… అంటే ఐక్యతా విగ్రహం. దేశంలో అన్ని ప్రాంతాల వారిని ఒక్క తాటిపైకి తెచ్చిన నేతగా సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి అది సరైన పేరే. అయితే ఆ విగ్రహం పెట్టిస్తున్న బీజేపీ పెద్దలకి భిన్నత్వంలో ఏకత్వంపై నమ్మకం ఉందా ..?. అనేదే అసలు పాయింట్. విభజన రాజకీయాలు చేయడంలో బీజేపీ నేతలను మించిన వారు లేరు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కొన్ని పార్టీలను చీల్చుతారు. మరికొన్ని పార్టీలను ఉసిగొల్పుతారు. ఇంకొన్ని పార్టీలను నెలకొల్పుతారు. ఇలా గెలుపే ధ్యేయంగా విభజనవాదం ముందుకు తెస్తున్నారు. అలాంటి మోదీ, అమిత్‌షాలకు సర్ధార్ విగ్రహం పెట్టే నైతికత ఉందా..?
ఐక్యత పేరుతో విభజన బీజేపీ స్టైల్..!
దేశంలో అన్ని సంస్థానాలు ఏకం చేశారు కాబట్టి…, వల్లభాయ్ పటేల్ విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ యూనిటీ గా పేరుపెట్టారు. కానీ బీజేపీ నేతలు చెప్పే మాటల్లో ఆ యూనిటీ ఎక్కడుంది..? దేశంలో అన్ని వర్గాలను కలిపి ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అధికార పార్టీ నేతలు అందుకు తగ్గట్టుగా ప్రవర్తించాలి. కానీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు బీజేపీ నేతల్లో అది కనిపించదు. వర్గాలు, కులాల వారీగా రాజకీయాలు చేస్తున్నారg. ఓ వర్గాన్ని వ్యతిరేకించి మరో వర్గాన్ని సంతృప్తి పరచి..ఓట్లు కొల్లగొట్టే విభజన రాజకీయాలు చేసే కమలనాథులు.. ఐక్యత చిహ్నంగా సర్ధార్ విగ్రహాన్ని స్థాపించడం దిగుజారుడుతనం కాక మరేంటి..? పటేల్ ఇప్పుడు విగ్రహం పెట్టి మోడీ కొత్తగా ప్రపంచానికి చాటి చెప్పాల్సింది ఏమీ లేదు. అయినా బీజేపీ ఎందుకు తామేదో గొప్ప గౌరవం ఇస్తున్నట్లు ఈ ప్రాజెక్ట్ ప్రారంభించింది. రూ. 3వేల కోట్ల భారీ బడ్జెట్‌తో ఎందుకు నిర్మించింది. బీజేపీ జాతీయ నాయకుల్ని సొంతం చేసుకునే పనిలో ఇదో పెద్ద అడుగు.
విగ్రహాలు సరే స్ఫూర్తి తీసుకోరా..?
గాంధీ, నెహ్రూతో మొదలుపెట్టి అనేక మంది జాతీయ నాయకులకు మేం వారసులు అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోంది. నూట యాభై ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీ అని, స్వాతంత్ర్యం తెచ్చామని చాటుకుంటోంది. భారత ఘన వారసత్వం కొనసాగిస్తామని ప్రచారం చేసుకుంటోంది. బీజేపీకి ఈ అడ్వాంటేజ్ లేదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పుట్టిన పార్టీ. తాము ఫలానా గొప్పవాళ్లకు వారసులం అని చెప్పుకోలేరు. దీంతో కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిన జాతీయ నాయకులను గుర్తించి, తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నెహ్రూ పుట్టినరోజు నాడే మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి పుట్టినరోజు కూడా. సాధారణంగా ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇద్దరికీ నివాళులర్పిస్తారు. కానీ మోడీ మాత్రం లాల్ బహుదూర్‌కి ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తారు. అంటే ఆయన గొప్పతనాన్ని గుర్తించడం ద్వారా వీళ్లు గొప్పవాళ్లు అవ్వడం అన్నమాట. ఇప్పుడు పటేల్ కీర్తిని పదే పదే చాటడం వెనుక ఉన్న వ్యూహం కూడా ఇదే. సర్ధార్ గొప్పతనాన్ని ఉక్కు విగ్రహం ద్వారా చాటి… ఆ వెలుగులో తామూ గొప్పవాళ్లం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
చైనా తయారీ పటేల్‌తో ఏం సందేశం ఇస్తారు..?
పటేల్ విగ్రహం తయారీలో ప్రధాన పాత్ర చైనాదే. స్టాట్యూ ఆఫ్ యూనిటీ విగ్రహానికి అయిన ఖర్చు మూడు వేల కోట్లు. ఎల్ అండ్ టీ కంపెనీ నిర్మిస్తుంది. కానీ మన దేశంలో ఏ కంపెనీకి ఇలా భారీ ఉక్కు విగ్రహాలు తయారుచేసిన అనుభవం లేదు. కేవలం చైనా, తైవాన్లు మాత్రం భారీ విగ్రహాలు తయారుచేశాయి. దీంతో ఎల్ అండ్ టీ కంపెనీ చైనాలోని ఓ ప్రైవేట్ ఫౌండ్రీకి నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. అక్కడే కొన్ని విభాగాలుగా తయారుచేసి ఇక్కడకు తెచ్చారు. చైనా ఇంజనీర్లు రెండేళ్లుగా ఇక్కడే ఉండి.., నిర్మాణం చేస్తున్నారు. అంటే ఖర్చులో మెజార్టీ బడ్జెట్ చైనాకు తరలిపోయినట్టే. మరి మన మేకిన్ ఇండియా ఏమైనట్టు?.
… సుభాష్