భారత భాభాగాన్ని కొద్ది కొద్దిగా ఆక్రమించుకుంటూ.. చర్చల పేరుతో టైంపాస్ చేస్తున్న చైనా కు చెక్ పెట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యూహాత్మకంగా అడుగులేశారు. హఠాత్తుగా చైనా సరిహద్దుల్లో పర్యటించారు. అక్కడి సైనికులతో మాట్లాడారు. వారిలో మరింత స్ఫూర్తి నింపారు. లద్దాఖ్‌లోని నిము ప్రాంతానికి మోడీ వెళ్లారు. సముద్ర మట్టానికి 11 వేల అడుగుల ఎత్తులో ఆ ప్రాంతం ఉంటుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆర్మీ, వైమానిక, ఐటీబీపీ ఉన్నతాధికారులతో ప్రధాని మాట్లాడారు. ప్రపంచం మొత్తానికి భారత్ శక్తి సామర్థ్యాలు నిరూపించామని సైనికులను అభినందించారు.
జల, వాయు, పదాతి, అంతరిక్షం విభాగాల్లో మన శక్తి సమున్నతంగా ఉందని.. విస్తరణకాంక్షతో సాగిన శక్తులు తోకముడవడమో లేక ఓటమో చవిచూశాయని చరిత్రలో ఇదే ఉందని గుర్తు చేశారు. గల్వాన్ ఘటన తర్వాత చైనా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కొద్ది కొద్దిగా దేశ భూభాగంలోకి వస్తూనే ఉంది. అయితే సైనిక చర్చల పేరుతో.. చైనా.. భారత్ ను నిలువరిస్తోంది. మరో వైపు చేయాల్సిన పని చేస్తోంది. ఈ సమయంలో చైనాను నిలువరించడానికి మోడీ వ్యూహాత్మకంగా సరిహద్దులకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇంక ఏ మాత్రం.. సహించే ప్రశ్నే లేదని.. అవసరం అయితే యుద్ధానికి సైతం సిద్ధమన్న సంకేతాలను మోడీ చైనాకు పంపారని అంటున్నారు. సరిహద్దు వద్ద మోడీ పర్యటించడంతో.. చైనా ఉలిక్కి పడింది.
ప్రత్యేకంగా ఎలాంటి పేరు చెప్పకుండా… ప్రస్తుతం సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని.. ఎవరూ పరిస్థితిని మరింత దిగజార్చేలా వ్యవహరించకూడదని నీతుల ప్రకటన చేసింది. మోడీ లద్దాఖ్ పర్యటన.. అంతర్జాతీయంగానూ హైలెట్ అయింది. ఇంత కాలం భారత్ ఇరుగు పొరుగు దేశాలతో శాంతిని కోరుకుందని.. ఇప్పుడు తమ భూభాగంపైనే కన్నేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు అయిందన్న విశ్లేషణ అంతటా వినిపిస్తోంది.