ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం తొలి సారి వస్తున్నారు. మొత్తంగా రెండు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయడం , ప్రారంభోత్సవాలు చేయడం వంటి కార్యక్రమాలు ఉన్నాయి. అందులో అత్యంత కీలకమైన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు కూడా ఉంది. లక్షా ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడుల్నిఈ ప్రాజెక్టు మీద పెడుతున్నారు. ఇక కేంద్ర నిధులతో అభివృద్ధి చేసిన అనేక పనుల్ని ప్రారంభిస్తారు.
విశాఖలో రోడ్ షో, బహిరంగసభ కూడా నిర్వహిస్తున్నారు. ఈ టూర్ కు ఇంచార్జ్ గా నారా లోకేష్ వ్యవహరిస్తున్నాయి. చరిత్రలో నిలిచిపోయేలా రోడ్ షో.. సభ ఉండాలని లోకేష్ ప్లాన్ చేశారు. ఎన్నికల ప్రచారం చివరిలో విజయవాడలో మోదీ, చంద్రబాబు, పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్ షో చేశారు. ఇవాళ కూడా అదే తరహాలో విశాఖలో రోడ్ షో చేయనున్నారు. ఓ రకంగా ఇది విజయోత్సవ ర్యాలీ, సభ అనుకోవచ్చు. మోదీ సభకు ప్రణాళికా బద్దంగా జన సమీకరణ చేస్తున్నారు.
గత ఆరేడు నెలల కాలంలో విశాఖకు చాలా గుడ్ న్యూస్ వచ్చాయి. కేంద్ర ప్రాజెక్టులు, ప్రైవేటు ప్రాజెక్టులు అనేకం వచ్చాయి. ప్రతిష్టాత్మక సంస్థలు తమ కార్యాకలాపాలు ప్రారంభించబోతున్నాయి. మరో వైపు బోగాపురం ఎయిర్ పోర్టు పనులు కూడా చురుకుగా సాగుతున్నాయి. రైల్వేజోన్ నిర్మాణం కూడా వచ్చే ఏడాదికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే రాష్ట్రంలో మౌలికమైన మార్పుల్ని చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.