ప్రజల్ని ఆకట్టుకోవడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమున్నత శిఖరాలకు ఎదిగిపోయారు. అసోంలోని ధోలాలో శుక్రవారం ఉదయం ఆయన వ్యవహరించిన తీరు ఈ అభిప్రాయాన్ని కలుగచేస్తోంది. తొలుత, దేశంలోనే పొడవైన వంతెనను ప్రారంభించిన ఆయన, కొంతదూరం వాహనంలో ప్రయాణించారు. మార్గమధ్యంలో కిందకి దిగి, వంతెనపై కొద్దిసేపు ఒంటరిగా నడిచారు. వంతెన పిట్టగోడ దగ్గరికి వెళ్ళి పరిశీలించారు. అక్కడినుంచే ఒడ్డున ఉన్న ప్రజలకు అభివాదం చేశారు. తదుపరి, తన వెంట వచ్చిన మిగిలిన వారిని కూడా రమ్మని పిలిచారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, అసోం ముఖ్యమంత్రి శర్వానంద్ సోనేవాల్, తదితరులు కిందికి దిగి ఆయన దగ్గరకు వచ్చారు. వారితో ప్రధాని కొద్దిసేపు ముచ్చటించారు. వంతెన విశేషాలనూ, ఇతర వివరాలనూ తెలుసుకున్నారు. అక్కడి నుంచి సభా స్థలికి పయనమయ్యారు. సభలో నితిన్ గడ్కరీ, సోనేవాల్ ప్రసంగాలను ఆద్యంతం విన్నారు. సోనేవాల్ అస్సామీ భాషలోనే తన ప్రసంగాన్ని చేశారు. ప్రధాన మంత్రి కూడా యథాప్రకారం అస్సామీ భాషలోనూ… అదే యాసలోనూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇది స్థానికులను బాగా ఆకట్టుకుంది. సరిగ్గా ఇక్కడే ప్రజల ఆయువు పట్టును పట్టుకునే ప్రయత్నాన్ని చేశారు. దేశానికే వన్నె తెచ్చే ఈ వంతెన ఆర్థిక విప్లవానికి నాంది పలుకుతుందని చెబుతూ, ఈ వంతెనకు భూపేన్ హజారికా పేరు పెడుతున్నట్లు ప్రకటించడంతో సభా ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది. బాలీవుడ్లో ప్రముఖ నేపథ్య గాయకుడైన హజారికా పేరును ప్రకటించడం ద్వారా ఆయన అస్సామీల మనస్సుల్ని గెలుచుకున్నారు. ఇదే సందర్భంలో ఈశాన్య రాష్ట్రాలు ఈ మూడేళ్ళలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని ప్రకటిస్తూ… దీన్ని బలపరచడానికి మోడీ విభిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. చప్పట్ల బదులు, హర్షధ్వానాల బదులు ప్రత్యామ్నాయాన్ని ఆయన సూచించారు. ప్రజలు తమ వద్ద ఉన్న మొబైళ్ళను బయటకు తీసి, అందులో ఫ్లాఫ్ లైట్లను వెలిగించి, అందరికీ కనిపించేలా చూపాలని కోరారు. అంతే సభా ప్రాంగణంలో ఉన్నవారంతా ఆయన చెప్పినట్లే చేసి, తమ హర్షామోదాలను వ్యక్తంచేశారు. కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టి, ప్రజల మనస్సుల్ని గెలుచుకున్నారు.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి