ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ఆంధ్రప్రదేశ్ పర్యటన వాయిదా పడింది. జనవరి ఆరో తేదీన “నిజం పిలుస్తోంది” పేరుతో.. ఓ బహిరంగసభను గుంటూరు ఏర్పాటు చేసి… భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ కు ఏం చేసిందో చెప్పాలని అనుకున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. ఏపీ బీజేపీ నేతలు.. బహిరంగసభ ఏర్పాట్లు ప్రారంభించారు. అయితే అనూహ్యంగా ఆకస్మిక కార్యక్రమాల వల్ల పర్యటన వాయిదా వేసుకున్నట్లు.. ఢిల్లీ నుంచి ఏపీ బీజేపీ వర్గాలకు సమాచారం వచ్చింది. మళ్లీ జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరిలో మోదీ పర్యటించే అవకాశం ఉందని సూచించింది. మోడీ పర్యటన జరగదని.. వాయిదా పడటం ఖాయమన్న అంచనాలు రెండు రోజుల నుంచి ఏపీ రాజకీయవర్గాల్లో ఉన్నాయి. ఇప్పుడది నిజం అయింది.
ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఆకస్మిక కార్యక్రమాలేమిటన్నదానిపై.. స్పష్టత లేదు. అయితే.. ఏపీలో రాజకీయ పరిస్థితుల కారణంగానే ఆయన పర్యటన వాయిదా వేసుకున్నారని భావిస్తున్నారు. అదే ఆరో తేదీన ఆయన కేరళ పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ శబరిమల సమీపంలో ఓ బహిరంగసభలో పాల్గొననున్నారు. అయినప్పటికీ.. ఏపీ టూర్ ని మాత్రం వాయిదా వేసుకున్నారు. ఏపీలో మోడీ పర్యటన నేపధ్యంలో.. నిరసనకు .. వైసీపీ, జనసేన మినహా ఇతర పార్టీలన్నీ పిలుపునిచ్చాయి. ఒకటో తేదీ నుంచి.. నిరసనలు పెంచుకుంటూ పోవాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబునాయుడు కూడా… ప్రభుత్వ పరంగా.. బీజేపీ ఏం సాయం చేసిందో.. ఏపీ ప్రభుత్వం ఎంత చేసిందో వివరించేందుకు ప్రత్యేకంగా పది శ్వేతపత్రాలు విడుదల చేయాలనుకున్నారు. ఇప్పటికి ఐదు విడుదల చేశారు.
మోడీ పర్యటన వల్ల ప్రజల్లో విభజన సెంటిమెంట్ మరింత పెరిగిపోతుందని.. దాని వల్ల అంతిమంగా టీడీపీ లాభ పడుతుందన్న అంచనాలు రావడంతోనే… మోడీ పర్యటన వాయిదా వేసుకున్నట్లు రాజకీయవర్గాలు చెబుతున్నా.యి. ఎలాంటి అధికారిక కార్యక్రమం లేకపోవడంతో.. ప్రభుత్వం తరపున ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం కూడా నిర్ణయించుకుంది. ఈ కారణాలతో..మోడీ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది.