భారత ప్రజాస్వామ్యానికి అతి సులువైన నిర్వచనం ఉంది… అదేమిటంటే.. ప్రజల చేత.. ప్రజల కొరకు.. ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వం ఉండటమే ప్రజాస్వామ్యం. ఈ అర్థాన్ని ఇప్పుడు నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అర్థం మార్చేసింది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రభుత్వాలను డమ్మీలను చేస్తూ కొత్త చట్టం తీసుకు వచ్చింది. ముందుగా ఢిల్లీకే ఈ చట్టం అన్వయిస్తున్నప్పటికీ.. తర్వాత… దేశం మొత్తం విస్తరించడానికి ఇదో గొప్ప అవకాశంగా ఉపయోగపడుతుంది. ఢిల్లీలో ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నరే అన్న అర్థం వచ్చేలా కొత్త చట్టం తీసుకు వచ్చారు. ” నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ-2021″ బిల్లు ఉభయసభల్లో ఆమోదం పొందింది.
అంటే.. ఢిల్లీలో ప్రజా ప్రభుత్వాన్ని ఇక నామమాత్రం చేశారన్నమాట. కేంద్ర పాలితప్రాంతాల్లో ఇప్పటికే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి చుక్కలు చూపెట్టేలా లెఫ్టినెంట్ గవర్నర్లకు అధికారాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త చట్టంద్వారా అసలు ప్రభుత్వం అంటేనే… లెఫ్టినెంట్ గవర్నర్ అన్న నిర్వచనం మార్చేశారు. ఇక నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ కూడా పాలనాధికారే, ప్రభుత్వ రోజువారీ వ్యవహారాల్లో ఆయనకు జోక్యం చేసుకునే హక్కు ఉంటుంది. అంటే ఇక ప్రజా ప్రభుత్వం దాదాపుగా నిర్వీర్యం అయిపోయినట్లేనన్నమాట. కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం ఉంటే సమస్య ఉత్పన్నం కాదు. ఢిల్లీలో ఆప్ సర్కార్ ఉండి.. కేంద్రంలో బీజేపీ లాంటి సర్కార్ ఉంటే మాత్రం….లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా బీజేపీనే పరిపాలన చేస్తుంది. ఇప్పుడు జరగబోయేది అదే.
కొసమెరుపేమిటంటే.. ఈ బిల్లును ఒక్క బీజేపీ మినహా దాదాపుగా అన్ని పార్టీలు వ్యతిరేకించాయి. దీంతో రాజ్యసభలో పాస్ కాదని అందరూ అనుకున్నారు. బీజేడీ, వైసీపీ పార్టీలు… బిల్లుపై తీవ్ర విమర్శలు చేశాయి. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే .. తర్వాత లెఫ్టినెంట్ అనే పదం తీసేసి గవర్నర్ ద్వారా ఇతర రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలను నడుపుతారా అని విరుచుకుపడ్డారు. ఆయన ఆవేశం చూసి.. వ్యతిరేకంగా ఓటు వేస్తారేమో అనుకున్నారు.కానీ వాకౌట్ చేసి..బీజేపీకి ఉన్న నెంబర్లతోనే బిల్లు పాసయ్యేలా సహకరించారు. దీంతో ఏం జరుగుతుందో తెలిసి కూడా… ప్రజాస్వామ్యానికి ద్రోహం చేశారన్న విమర్శలు మూటగట్టుకుంటున్నారు.