ప్రధానమంత్రి నరేంద్రమోడీ మన్ కీ బాత్ బాగా ప్రసిద్ధి చెందింది. ఆయన మాటలను రేడియోలో వినిపిస్తారు. టీవీలు ఉన్న వాళ్లు కూడా రేడియోలో వినాల్సిన ” బాత్ ” అది. మంచి మంచి మాటలు చెబుతారు. ఈ సారి అవినీతి గురించి కూడా మాట్లాడారు. అది దేశానికి పట్టిన చీడ అని దాన్ని వదిలించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అవినీతి దేశానికి ఎంత నష్టం చేస్తుందో చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ.. ఆయన ఏడేళ్ల కాలంలో ఈ అవినీతి అంతం ఎందుకు చూడలేపోయారు. అవినీతి అంతం చూడలేకపోవచ్చు కానీ అవినీతి పరుల్ని మాత్రం ఏరి వేయడం ప్రభుత్వానికి పెద్ద విషయం కాదు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి అసలు విషయం కాదు.
ప్రభుత్వ ఆఫీసుల్లో రూ. వంద.. వెయ్యి లంచాలు తీసుకునే అవినీతి ప్రజల్ని పీడిస్తోంది. అంతకు ముంచి కొన్ని వేల రెట్ల అవినీతి చేసే వాళ్లు దేశాన్ని పీడిస్తున్నారు. ఈరెండు రకాల అవినీతిల్లో గడ ఏడేళ్ల కాలంలో ప్రధాని మోడీ కేంద్రం తరపున ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమీక్ష చేస్తే.. విషయం తెలిసిపోతుంది. ఆర్థిక నేరస్తులు బీజేపీలో చేరో.. లేకపోతే బీజేపీతో సన్నిహిత సంబంధాలు పెట్టుకునే దర్జాగా బయట తిరుగుతున్నారు. వారిపై విచారణలు జరగడం లేదు. పక్కా ఆధారాలతో సాక్ష్యాలు ఉన్నా ఈడీ లాంటి సంస్థలు పట్టించుకోకుండా పక్కపోతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
బడా బడా రాజకీయ నేతలు.. బడా వ్యాపారులు కలిసి చేస్తున్న స్కాములు కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి. క్విడ్ ప్రో కో వ్యవహారాలతో వేల కోట్లు కొల్లగొట్టిన వారు దర్జాగా తిరుగుతున్నారు. అదే తరహా నేరాలు మళ్లీ మళ్లీ చేస్తున్నారు. ఇవన్నీ కళ్ల ముందు కనిపిస్తున్న సాక్ష్యాలు. కానీ ఎవరిపై చర్యలు తీసుకున్నారు. అటు కింది స్థాయి అవినీతి కానీ ఇటు పై స్థాయి అవినీతి కానీ ఎక్కడా తగ్గిన దాఖలాలే లేవు. ప్రధానమంత్రిగా మోడీ అభ్యర్థిత్వం ఖరారైనప్పుడు అవినీతిని అంతం చేస్తారని ప్రజలు అనుకున్నారు. స్విస్ బ్యాంక్ నుంచి డబ్బులు తెస్తారని అనుకున్నారు. బ్లాక్ మనీ గుట్టు రట్టు చేస్తారనుకున్నారు.
కానీ ఇప్పటికీ ప్రధాని మోడీ అవినీతి అంతం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ప్రజలకు మాత్రం ఓ క్లారిటీ వస్తోంది. ఈ రాజకీయ అవినీతిని ఎవరూ అంతం చేయలేరని.. నిట్టూరుస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను కుంగదీసే అవినీతి అంతమైనప్పుడే దేశం అభివృద్ధి చెందుతున్న అనే ట్యాగ్ నుంచి బయటపడుతుంది. లేకపోతే.. ఆర్థిక వినాశనమే జరుగుతోంది. మరి ప్రధానిపై ఇంకా ఆశలు పెట్టుకోవచ్చో లేదో మరి !