ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి తెలుగులో ట్వీట్ వెలువడింది. చిరంజీవి, నాగార్జున ,వరుణ్ తేజ్ , సాయి ధరమ్ తేజ్ తదితర హీరోలు పాట ద్వారా కరోనా విషయంలో ప్రజలను చైతన్యం చేయడానికి ప్రయత్నించిన సంగతి, ఆ పాట తెలుగు రాష్ట్రాలలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని అభినందిస్తూ ప్రధాని వీరికి ధన్యవాదాలు తెలియజేశారు.
నరేంద్ర మోడీ ట్వీట్ చేస్తూ, “చిరంజీవిగారికీ, నాగార్జునగారికీ, వరుణ్ తేజ్ కీ, సాయి ధరమ్ తేజ్ కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు.
అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం.
అందరం సామాజిక దూరం పాటిద్దాం.
కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం.
#IndiaFightsCorona” అని రాసుకొచ్చారు.
ఈ పాటను సంగీత దర్శకుడు కోటి రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. కోటి మాత్రమే కాకుండా మరెంతో మంది పాటల ద్వారా కరోనా వైరస్ విషయంలో తెలుగు ప్రజలను చైతన్యం చేయడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా చౌరస్తా బ్యాండ్ కి చెందిన రామ్ మిరియాల పాడిన “చేతులెత్తి మొక్కుతా” అనే పాట చాలా ఊళ్ళలో పోలీసులే మైకుల ద్వారా వినిపిస్తున్నారు. అలాగే సంగీత దర్శకుడు కీరవాణి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా లోని “ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి” పాట ట్యూన్ లో కరోనా వైరస్ మీద చైతన్యం చేస్తూ పాడిన పాట కూడా పలు ఛానల్స్ లో వినిపిస్తోంది. వీరే కాకుండా జొన్నవిత్తుల, రామ్ గోపాల్ వర్మ లాంటి వారు కూడా వారి స్టైల్ లో ఈ వైరస్ గురించి పాటలు పాడారు.
మొత్తానికి తెలుగు హీరోలను అభినందిస్తూ ప్రధాని తెలుగులో చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.