నరేష్ ‘మా’ అధ్యక్షపీఠంలో కూర్చుని ఏడాది కావొస్తుంది. ఈ కాలంలో ఆయన చేపట్టిన సంక్షేమ పథకాల మాటెలా ఉన్నా – బోలెడన్ని వివాదాలు నడిచాయి. నరేష్‌ని దింపేయడానికి ఓ వర్గం తీవ్రంగా ప్రయత్నించింది. నరేష్ ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారని, ఎవరితోనూ చర్చించకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని ‘మా’ సభ్యుల ప్రధాన ఆరోపణ. ఇటీవల ఈ విషయమై చాలా గొడవలు కూడా జరిగాయి. అయితే `మా` పదవిపై తనకు ఎలాంటి వ్యామోహం లేదని, ఈ క్షణమైనా తాను పదవి నుంచి దిగిపోవడానికి రెడీ అని అంటున్నారు.
యేడాదిలో చాలా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించానని, ఆ విషయంలో సంతృప్తిగానే ఉన్నానని, అందుకే పదవిని వదులుకోమన్నా – సిద్ధమేనని అన్నారు. కాకపోతే తనని దించేసే అధికారం మాత్రం ఎవరికీ లేదంటున్నారు నరేష్. ”నేను సభ్యుల చేత ఎన్నికై ఈ స్థానంలో కూర్చున్నాను. ఇదేమీ నామినేటెడ్ పదవి కాదు. నన్ను దించేయడం ఎవరి తరం కాదు” అని చెప్పుకొచ్చారు. `మా`లో రెండు ప్యానళ్లు ఉండడం వల్ల, ఇలాంటి చిన్న చిన్న సంఘర్షణలు రావడం మామూలేనని, రాజకీయాలకు అతీతంగా, కేవలం సేవా దృక్పథంతో తాను పనిచేయాలనుకుంటున్నానని, వివాదాల జోలికి వెళ్లాలన్న ఆసక్తి లేదని, తాను ఎప్పటికీ అజాత శత్రువునేనని పేర్కొన్నారు నరేష్.