కృష్ణను అనుకరించే పాత్రలపోషణతో తెలుగుతెరమీద ఎందరు నటులు ఎన్నెన్ని వేషాలు వేసినప్పటికీ.. కృష్ణ కుటుంబసభ్యుడిగానే చెలామణీ అవుతూ, ఆయన ఫ్యాన్స్ అభిమానాన్ని కూడా పొందుతున్న విజయనిర్మల కొడుకు నరేష్ మెప్పించినంతగా మరొకరు మెప్పించలేదు. కృష్ణను ఇమిటేట్ చేయడంలో నరేష్ తన ప్రత్యేకమైన శైలిని ‘కనకమాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్’ వంటిచిత్రాల్లో నిరూపించుకున్నాడు. అయితే తాజాగా ఖబర్ ఏంటంటే.. ప్రస్తుతం క్యారెక్టర్ వేషాలు వేస్తున్న ఈ సీనియర్ నరేష్.. నటశేఖర కృష్ణను వేధించడానికి, టార్చర్ పెట్టడానికిసిద్ధమవుతున్నాడుట.
కంగారేం అక్కర్లేదు. నిజజీవితంలోకాదు. ప్రస్తుతం నరేష్ ఒకేసారి అటు హీరో కృష్ణతోను, హీరో మహేష్ బాబుతోను రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్‌బాబుకు తండ్రిగా నరేష్ నటిస్తుండడం విశేషం. అయితే.. కృష్ణ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న ‘శ్రీశ్రీ’ అనే మరాఠీ అనువాద చిత్రంలో కూడా నరేష్ ఓ కీలక భూమిక పోషిస్తున్నాడు.
ఈ చిత్రంలో శ్రీశ్రీ అనే పాత్రలో హీరో కృష్ణ.. ఒక న్యాయవాదిగా కనిపిస్తారు. తండ్రీ కూతురు ప్రేమ ఆధారంగా కొన్ని కీలక సంఘటనలుకథలో నడుస్తాయి. క్రైం, పరిశోధన ఆధారంగా సినిమా సాగుతుంది. ఇది ఒక మంచి మరాఠీ చిత్రానికి అనువాదంగా రూపొందుతోంది. అయితే ఈ కథలో కృష్ణ పాత్ర నేరస్తుడిగా ఎస్టాబ్లిష్ అవుతుంది. కృష్ణ చేసే నేరాలకు సంబంధించి పరిశోధన చేసే పోలీసాఫీసర్ పాత్రను నరేష్ పోషిస్తున్నాడు. అంటే ఆటోమేటిగ్గా.. కృష్ణను వెంటాడి, వేధించి, టార్చర్ పెట్టే బాధ్యతను ఈ చిత్రంలో భుజానికెత్తుకుంటున్నాడన్నమాట.
కృష్ణ చిత్రంలో పోలీసాఫీసర్ పాత్రను చేస్తున్న సంగతి నరేష్ స్వయంగా ఇటీవల తన బర్త్‌డే సందర్భంగా జరిగిన వేడుకలో వెల్లడించాడు. ఒకేసారి ఇద్దరు సూపర్స్టార్లు కృష్ణ, మహేష్‌బాబులతో వేర్వేరు చిత్రాల్లో నటించడం సంతోషంగా ఉన్నదంటున్నాడు ఈ వెటరన్ హీరో.