‘మా’ ఎన్నికల ప్రచారం పూర్తయ్యింది. రేపే ఓటింగ్. ఈసారి వేడి మామూలుగా లేదు. చివరి క్షణాల్లోనూ… ఎవరి ప్రయత్నాలు వాళ్లు ముమ్మరం చేస్తున్నారు. తాజాగా నరేష్ ఓ సంచలన ఆరోపణ చేశారు. ప్రత్యర్థి వర్గం (ప్రకాష్ రాజ్ ప్యానల్) ఓటుకి రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకూ పంచుతున్నారని, ఆ డబ్బులు తీసుకుని, మనస్సాక్షికి నచ్చినట్టుగా ఓటేయమని ఆయన మా సభ్యుల్ని కోరారు. `మా` లో గెలుపుకోసం ప్రత్యర్థి వర్గం కుయుక్తులు పన్నుతోందని, రాత్రి ఇంటింటికీ తిరుగుతూ డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ.. ఓ వీడియో బైట్ వదిలారు.
”కరోనా సమయంలో కొంతమంది సభ్యులకు పది వేల రూపాయల చొప్పున పంచితే నాపై రకరకాల కామెంట్లు చేశారు. ఇప్పుడు ఓటుకి పాతిక వేలు పంచుతున్నారు. అందుకే వాళ్లు మానిఫెస్టో కూడా విడుదల చేశారు. డబ్బులతో గెలుస్తామన్నది వాళ్ల భరోసా. డబ్బులతో గెలిచేద్దాం అనుకుంటున్నారు. ఇస్తే తీసేసుకోండి. ఎందుకంటే వాళ్ల నుంచి మళ్లీ డబ్బులు రావు. ఓటుమాత్రం విష్ణు ప్యానల్ కి వేయండి. నేనెప్పుడూ అబద్ధాలు ఆడను. తప్పులు చెప్పను. నాకొచ్చిన వార్తని మీతో పంచుకున్నా” అని వీడియోలో పేర్కున్నారు.