మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్న నరేష్.. మా అధ్యక్షుడు శివాజీరాజాపై తీవ్రమైన ఆరోపణుల చేశారు. చిరంజీవిలాంటి మెగాస్టార్ ను అమెరికా తీసుకెళ్లి ఈవెంట్లు నిర్వహిస్తే కేవలం రూ. కోటి మాత్రమే వచ్చాయని చెప్పడమేమిటని.. ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మా కార్యదర్శిగా తనకు సీఈవో తరహా అధికారాలు ఉన్నా.. తనకు ఎలాంటి సమాచారం .. రావడం లేదన్నారు. “మా”కు సంబంధించిన సమావేశాల రికార్డింగ్ గత ఏడాదిగా లేవని.. వాటిని కావాలనే మాయం చేశారనే రీతిలో నరేష్ ఆరోపణలు గుప్పించారు. అక్రమాలు జరిగాయని కచ్చింతగా చెప్పని నరేష్.. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ తో విచారణ జరిపిస్తే అన్నీ బయటకు వస్తాయంటున్నారు. ‘మా’లో ఏం జరుగుతుందో కార్యవర్గానికి తెలియాల్సి ఉందన్నారు. అధ్యక్షుడు శివాజీరాజా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు
ఆరోపణలపై శివాజీ రాజా సమాధానం చెప్పాలని నరేష్ డిమాండ్ తచేశారు. నిధుల గోల్మాల్పై మీడియాలో వార్తలు వచ్చాక.. శివాజీరాజా కనిపించడం లేదన్నారు. గుండు గీయించుకుంటా.. మీసాలు కొరుక్కుంటా అనను.. చిన్నపిల్లాడిలా ఒట్లు వేయనని ప్రకటించారు. రజతోత్సవ కార్యక్రమంలో మొదటి నుంచి తనను పక్కనబెట్టారని నరేష్ ఆరోపించారు. ముగ్గురి నుంచి కొటేషన్ తీసుకోమని నేను చెప్పినా వినలేదన్నారు. అమెరికాలో జరిగే కార్యక్రమ వివరాలు చెప్పలేదన్నారు. నా ఫోన్ నెంబర్ను శివాజీరాజా బ్లాక్లో పెట్టారని.. తన ఫోన్ లాగ్స్ ను నరేష్ మీడియాకు చూపించారు. త్వరలో నిర్వహించాలనుకుంటున్న మహేష్ ప్రోగ్రాం విషయంలోనూ తనను పక్కనబెట్టారని చెబుతున్నారు.
2017 లో ఏకగ్రీవంగా ఎంపికైన మా కార్యవర్గం..ఇప్పుడు రెండుగా చీలిపోయింది. నిజానికి మొదటి నుంచీ మాలో రెండు వర్గాలున్నాయి. అయితే దాసరి సలహాతో 2017 మార్చిలో ఈ రెండు వర్గాలూ ఏకమయ్యాయి. శివాజీరాజా అధ్యక్షుడిగా, నరేశ్ ప్రధాన కార్యదర్శిగా ‘మా’ కార్యవర్గం 2017 మార్చిలో ఏర్పడింది. ఈ కార్యవర్గం పదవి కాలం 2019 మార్చితో ముగుస్తుంది.అయితే ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎంపికైనా శివాజీ రాజా, నరేశ్ మధ్య తిరిగి విభేదాలు నెలకొన్నాయి. ‘మా’ రజతోత్సవం సందర్భంగా అమెరికాలో ఏర్పాటు చేసిన ఈవెంట్ ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. శివాజీరాజా, శ్రీకాంత్ తమకు తెలిసిన స్నేహితులకు ఈ ఈవెంట్ ను అప్పగించి లబ్దిపొందారన్నది నరేశ్ ప్రధాన ఆరోపణ. చిరంజీవిలాంటి స్టార్ హీరోను అమెరికాకు తీసుకెళ్ళి కేవలం కోటి రూపాయలు సేకరించడంపై నరేశ్ నిరసన తెలిపారట. అయితే..ముందు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారమే ఈవెంట్ నిర్వాహకుల నుంచి డబ్బులు రాబట్టామని శివాజీరాజా, శ్రీకాంత్ చెబుతున్నారు. నిధుల గోల్ మాల్ జరగలేదని, దుర్వినియోగం కాలేదని ఉదయం ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. నిరూపిస్తే ఆస్తి మొత్తం రాసిస్తామని చాలెంజ్ కూడా చేశారు. మా అసోసియేషన్ డబ్బులతో ఇప్పటి వరకు టీ కూడా తాగలేదని అధ్యక్షుడు శివాజీ రాజా చెప్పారు. అయితే నరేష్ మాత్రం.. ఒక్కొక్కరు రూ. 3 లక్షలు ఖర్చు పెట్టి అమెరికాకు బిజినెస్ క్లాస్ లో ప్రయాణించారని ఆరోపిస్తున్నారు.
వివాదాన్ని ముగించేందుకు చిరంజీవి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని ప్రచారం జరుగుతోంది. మీడియా సమావేశం పెట్టే ముందు నరేష్..చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయనకు తన వాదన వినిపించారు. అంతర్గతంగా పరిష్కరించుకోవాలని చిరంజీవి సలహా ఇచ్చినా.. శివాజీ రాజా అసలు కాంటాక్ట్ లోకి రావడం లేదని… తనపై ఆరోపణలు చేసినందున.. మీడియా సమావేశంలోనే సమాధానం ఇస్తానని.. నరేష్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వివాదం ముగింపు కోసం.. ప్రస్తుతం రెండు వర్గాల మధ్య రాజీ కోసం.. ప్రయత్నించేవారే ఇండస్ట్రీలో కరవయ్యారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో ఇలాంటి వివాదాలొస్తే దాసరి నారాయణరావు డీల్ చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు.