ఈసారి ‘మా’ ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా జరిగాయి. మరీ ముఖ్యంగా అధ్యక్షపదవికి నరేష్ – శివాజీ రాజాల మధ్య భీకరమైన పోటీ నడిచింది. ఈ పోటీలో 69 ఓట్ల తేడాతో శివాజీ రాజాపై నరేష్ గెలుపొందాడు. శివాజీరాజాకు 199 ఓట్లు పోలైతే.. నరేష్‌కి 268 ఓట్లు పడ్డాయి. ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఓ కల్యాణ్‌కి కేవలం ఒకే ఒక్క ఓటు పడింది.
గెలిచిన అనంతరం నరేష్ ప్యానల్ ఫిల్మ్ ఛాంబర్ దగ్గర సంబరాలు చేసుకుంది. అనంతరం నరేష్ ఉద్వేగంగా మాట్లాడారు. తనకు యాభై ఓట్లు రావని, జీవితంలో అధ్యక్షుడ్ని కాలేనని శివాజీ రాజా అన్నాడని, ఇప్పుడు 70 ఓట్ల తేడాతో తాను గెలిచానని ఉద్వేగంగా చెప్పుకొచ్చారు. ‘మా’లో తమ మధ్య మనస్పర్థలు ఏర్పడిన మాట వాస్తవమే అని, అవన్నీ సహజమని, అయితే ఎవరి గురించీ తాను చెడుగా మాట్లాడలేదని, కొంతమంది మాత్రం తనపై దుష్ప్రచారం చేశారని, ఆ సమయంలో తాను చాలా మానసిక క్షోభ అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశారు. ”శివాజీ రాజా ఐలవ్ యూ… మనం కలసి పనిచేద్దాం. ఎవరైనా మాతో కలసి పనిచేయొచ్చు. నేను ఈ ఒక్క టర్మే ఉంటాను. కానీ నాయకత్వం ఎలా ఉండాలో చేసి చూపిస్తాను” అంటూ ‘మా’ సభ్యులకు మాటిచ్చారు నరేష్. చిరంజీవి, నాగబాబు, నాగార్జున లాంటి కథానాయకుల అండ తమకుందని, ‘మా’ సొంత భవనం కోసం చిరంజీవి కృషి చేస్తానని మాటిచ్చారని నరేష్ గుర్తు చేశారు.