సీనియర్ నటుడు హీరో నరేష్ కు న్యూయార్క్ కు సంబంధించిన అకడెమీ ఆఫ్ యూనివర్సిటీ గ్లోబల్ పీస్ అనే సంస్థ నుండి డాక్టరేట్ పురస్కారం అందించడం జరిగింది. 7వ ఏట నుండే నటన మీద ఆసక్తిగా ఉన్న తాను ఈ పొజిషన్ కు రావడానికి గల కారణమైన జంద్యాల, విజయ నిర్మల, కృష్ణ గార్లకు ఈ డాక్టరేట్ ను అంకితమిస్తున్నానని అన్నారు. డాక్టరేట్ అందుకున్నా నటుడిగా గౌరవంతో పాటు బాధ్యత కూడా పెరిగిందని అభిప్రాయపడ్డారు నరేష్.
తానెప్పుడు అవార్డులు రివార్డుల కోసం ప్రాకులాడలేదని.. తన టాలెంట్ ను మెచ్చి అవే తన వెంట పడుతుంటాయని అన్నారు. ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న నరేష్ ఈ మధ్య తన స్పీడ్ ను పెంచారనే చెప్పాలి. జనవరి 1న రిలీజ్ అయిన నేను శైలజ నుండి రీసెంట్ రిలీజ్ గుంటూర్ టాకీస్ దాకా తన మార్క్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
గుంటూర్ టాకీస్ లో నటన తనను పదిమెట్లు ఎక్కేలా చేసిందని చెబుతున్నారు. ఇక ఈ సంవత్సరం రానున్న బ్రహ్మోత్సవం, శ్రీశ్రీ, అ..ఆ సినిమాల్లో కూడా తాను నటించానని.. అవి కూడా ప్రేక్షకులు మంచిగా ఎంటర్టైన్ చేస్తాయని అంటున్నారు. నటుడిగా మరో ప్రస్థానాన్ని మొదలు పెట్టిన డాక్టర్ నరేష్ ఇకనుండి చేస్తున్న సినిమాలన్ని మరింత మంచి పేరు తీసుకురావాలని ఆశిద్దాం.