సినిమా సినిమాకు నటుడు అనేవాడు సాన బెట్టిన కత్తిలా తయారవుతాడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక పాత తరం నటులైతే ప్రత్యేకించి ప్రస్థావించాల్సిన అవసరం కూడా ఉండదు. వారు నటిస్తున్నారా జీవిస్తున్నారా అన్న సందేహం కూడా కలగక మానదు. సీనియారిటీ అనేది ఒక సన్నివేశంలో ఆ సందర్భాన్ని వ్యక్తపరుస్తూ అక్కడ డైలాగులు ఏమి లేకున్నా దాన్ని రక్తి కట్టించేలా ఉండాలి. అది ఒకటి రెండు సినిమాల అనుభవం ఉన్న వారు చేసే అవకాశం లేదు. ఇంతకీ ఈ వివరణ అంతా దేని గురించి అనేగా సూపర్ స్టార్ కృష్ణ సపోర్ట్ తో విజయ నిర్మల వారసత్వాన్ని అందుకుని 90వ దశకంలో హీరోగా తన సత్తా చాటి ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా క్రేజ్ సంపాధించిన సీనియర్ హీరో నటుడు నరేష్ గురించి.
ఇటీవల చాలా సినిమాల్లో పాత్రలు చేస్తున్న నరేష్ గుంటూర్ టాకీస్ లో చేసిన గిరి పాత్రకు ప్రాణం పోసి ఆ పాత్ర ఆయన మాత్రమే చేయగలరు అనేలా చేశారు. ఓ సన్నివేశంలో రోడ్డు మీద అచేతనంగా నడుచుకుంటూ ఏడుస్తూ వచ్చే నరేష్ నటుడు అనే మాటకు పరిపూర్ణత తెచ్చాడు అనిపిస్తుంది. ఆ పాత్రకు జీవం పోసిన నరేష్ తన అనుభవం చెప్పుకునేంత కాదు సన్నివేశంలో నటించి నిరూపించేంత అని చెప్పకనే చెప్పారు. సినిమా టాక్ ఎలా ఉన్నా గుంటూర్ టాకీస్ లో నరేష్ పాత్ర ఆయన లైఫ్ టైం చేసిన పాత్రల్లో గుర్తుండిపోతుంది అని చెప్పడంలో సందేహం లేదు.
పాత్ర ఏదైనా దానిలో పరకాయ ప్రవేశం చేయడం సీనియర్ నటుల వల్లే అవుతుంది. వారిలో నేను కూడా ఒకడిగా ఉన్నాను అంటూ చెబుతూ తన నట విశ్వరూపాన్ని చూపిస్తున్న నరేష్ కు కెరియర్ లో ఇలాంటి యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలు మరిన్ని దక్కించుకోవాలని ఆశిద్దాం.