మా అధ్యక్షుడు నరేష్ 40 రోజులు దీర్ఘకాలిక సెలవులో వెళ్లడం, ఆ స్థానంలో బెనర్జీ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం తెలిసిన విషయాలే. అయితే నరేష్ నిష్క్రమణ తాత్కాలికమా? లేదంటే శాశ్వతమా? అనే చర్చ మొదలైందిప్పుడు.
నరేష్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు తలకెత్తుకున్నప్పటి నుంచీ ఇప్పటి వరకూ “మా“లో రకరకాల సమస్యలు, గందరగోళాలు, వివాదాలు. వీటన్నింటికీ కేంద్ర బిందువు నరేషే. ఏక పక్ష నిర్ణయాలు తీసుకోవడం దగ్గర్నుంచి, మా నిధుల దుర్వినియోగం వరకూ ఆయనపై రకరకాల అభియోగాలు. ఆమధ్య మా డైరీ ఆవిష్కరణ సమయంలో జరిగిన గొడవ తో ‘మా’ లుకలుకలు విశ్వరూపం దాల్చాయి. వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజశేఖర్ రాజీనామా చేయడం కూడా కలకలం సృష్టించింది. అప్పటి నుంచీ నరేష్ ని అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తారన్న ఊహాగానాలు వ్యాపించాయి. ‘నేను ఓటింగ్ ద్వారా గెలిచిన వ్యక్తిని. నన్నెవ్వరూ నా స్థానం నుంచి తప్పించలేరు’ అంటూ నరేష్ కూడా ఆత్మవిశ్వాసం కనబరిచారు. అయితే… ఎప్పుడైతే నరేష్ పై అభియోగాలు ఎక్కువయ్యాయో, అప్పటి నుంచీ నరేష్ ని ఎలాగైనా సరే అధ్యక్ష పదవి నుంచి తప్పించాలన్న డిమాండ్లు ఎక్కువగా వినిపించాయి. ఈ విషయంలో చిరంజీవి కూడా మీటింగులు పెట్టి, మాలో పెద్ద తలకాయలందరికీ క్లాసులు పీకారు. ఇటీవల నరేష్ గురించి కొత్త కంప్లైంట్లు కూడా నమోదయ్యాయని తెలిసింది. ఈసీ మెంబర్లు సైతం నరేష్ పై గుర్రుగా ఉన్నారని, వాళ్లంతా కలిసి నరేష్ పై చర్య తీసుకోవాల్సిందే అని క్రమశిక్షణా సంఘానికి ఫిర్యాదు చేశారని, అందరూ ఓ నిర్ణయానికి వచ్చి నరేష్‌ని తప్పించాలనుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సడన్‌గా పదవి నుంచి తప్పుకున్నా, రాజీనామా చేసినా.. తప్పు ఒప్పుకున్నట్టే అవుతుందని భావించిన నరేష్ తన బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పుకుంటున్నట్టు ప్రకటించాల్సివచ్చిందని చెబుతున్నారు. నరేష్ ఇదివరకు కూడా షూటింగుల కోసం విదేశాలకు వెళ్లారు. అయితే అప్పుడు తన బాధ్యతలు వేరెవరికీ అప్పగించలేదు. ఇప్పుడు మాత్రం ఆ అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. నరేష్ పై విచారణ జరుగుతోందని, ఈ సమయంలో ఆయన అధ్యక్ష పదవిలో ఉండడం సరికాదనే… తాత్కాలికంగా పక్కన పెట్టారని, నరేష్ సైతం ఇప్పుడు ఆ కుర్చీలో కూర్చోవడానికి ఇష్టపడడం లేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి,