ఇప్పుడు సినిమా షూటింగు అంటే చాలా ఈజీ. రిస్కీ షాట్లని బ్లూ మ్యాట్ లలో లాగించేస్తారు. ట్రిక్ ప్లే చేసి.. అది నిజమని నమ్మించగలరు. డూప్‌లను ధైర్యంగా వాడుకోగలరు. అప్పట్లో ఇన్ని సౌలభ్యాలేం లేవు. హీరోలు సాహసం చేయాల్సిందే. నరేష్ అలాంటి సాహసమే చేశారు. తన గురువు… దైవం… జంథ్యాల కోసం.
‘పుత్తడి బొమ్మ’ షూటింగ్ నాటి సంగతి ఇది. క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. సన్నివేశం ప్రకారం హీరో నరేష్ నదిలో దూకాలి. కానీ.. గోదావరి ఉధృతి చాలా బీభత్సంగా ఉంది. ఎంత గజ ఈతగాడైనా సరే.. దూకితే మళ్లీ తేలతాడో లేదో ఎవ్వరికీ తెలీదు. అప్పటికీ డూప్ తో ప్రయత్నించారు. కానీ.. జేమ్స్ అనే డూప్‌ని తీసుకొచ్చారు. తను మంచి ఈతగాడు. కానీ… తను కూడా గోదారి ఉధృతికి కొట్టుకుపోయాడు. ఈ ఘనత నుంచి తేరుకోవడానికి చిత్రబృందానికి చాలా కాలం పట్టింది. అది షూటింగ్ చివరి రోజు. ఎలాగైనా సరే.. గోదారిలో దూకే షాట్ తీయాలనిపించింది జంథ్యాలకు. “నరేష్ ఇదే చివరి రోజు. ఈ షాట్ సినిమాకి చాలా అవసరం. నువ్వు దూకగలవా” అని జంథ్యాల నరేష్‌ని అడిగారు. నరేష్‌కి జంథ్యాల అంటే.. గురు భక్తి. ఆయన ఏం చెప్పినా చేయాల్సిందే. అందుకే మరో ఆలోచన లేకుండా.. ‘దూకేస్తా సార్’. అన్నాడు. నరేష్ కి ఈత వచ్చు. కానీ ఎందుకైనా మంచిదని నలుగురు జగ ఈతగాళ్లని పట్టుకొచ్చారు. అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. షాట్ ప్రకారం నరేష్ ధైర్యంగానే దూకాడు.కానీ.. గోదావరి ఉధృతికి.. కొట్టుకెళ్లిపోయాడు. సెట్లో అందరి కాళ్లూ గజ గజ వణికిపోయాయి. నరేష్ ఈత కొడుతున్నాడా? కొట్టుకెళ్లిపోతున్నాడా? లేదంటే ఇదంతా నటనలో భాగమా? ఈ విషయాలు ఎవ్వరికీ తెలీయడం లేదు.చివరికి నరేష్ నోటి నుంచి “హెల్ప్… హెల్ప్” అనే మాటలు వినిపించాయి. దాంతో గజ ఈతగాళ్లు నదిలో దూకి.. నరేష్ ని కాపాడారు. మొత్తానికి జంథ్యాలకు అనుకున్న షాట్ వచ్చింది. నరేష్ హెల్ప్.. హెల్ప్ అంటూ అరచిన అరుపుల్ని ‘నన్ను విడిచి వెళ్లొద్దు’ అంటూ డబ్బింగ్ లో మార్చుకున్నారు.