నర్సీపట్నం. ఈ పేరు చెబితే పొలిటికల్ సర్కిల్స్‌లో ఠక్కున గుర్తుకొచ్చే పేరు చింతకాయల అయ్యన్నపాత్రుడు. గెలుపోటములతో సంబంధం లేకుండా టీడీపీ ఆవిర్భావం నుంచి ఒకే పార్టీలో కొనసాగుతున్న నాయకుడు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన ఆయన కు జగన్ రెడ్డి చాలా మేలు చేశారు. మరోసారి ఆలోచించకుండా నర్సీపట్నం ప్రజలు అయ్యన్నకే ఓటు వేసేలా ఆయన నర్సీపట్నంలో పార్టీని చిందరవందర చేసుకున్నారు.
అయ్యన్న దూకుడును తట్టుకోలేని పూరి జగన్నాథ్ సోదరుడు
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు అయిన ఉమాశంకర్ గణేష్ గత ఎన్నికల్లో అయ్యన్నపై గెలిచారు. కానీ అయ్యన్న దూకుడుని తట్టుకొని నిలబడటంలో ఆయన బలం సరిపోవడం లేదని మొదటి రెండేళ్లలోనే తేలిపోయింది. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం వైసీపీ గెలిచింది. నర్సీపట్నంలో కూడా గెలిచింది కానీ.. గుడ్డిలో మెల్లగా గెలిచింది. 28 వార్డుల్లో అన్ని రకాల అధికార బలాలు ప్రయోగించి.. అయ్యన్న కుటుంబాన్ని చీల్చి సోదరుడు సన్యాసి పాత్రుడిని పార్టీలోకి తెచ్చుకున్న 14 కౌన్సెలర్ స్థానాల్లోనే గెలిచింది. టీడీపీ 12, జనసేన 1, ఇండిపెండెంట్ ఒకరు గెల్చుకున్నారు. పది , ఇరవై ఓట్ల తేడాతో వైసీపీ నాలుగైదు సీట్లను గెల్చుకుంది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు టీడీపీ మరింత బలపడింది.
అయ్యన్న కుటుంబాన్ని చీల్చడమే కాకుండా వేధింపులు
అయ్యన్న బలం తగ్గించడానికి అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడిని పార్టీలోకి తీసుకొని ఆయన కుటుంబానికి డీసీసీబీ ఛైర్మన్ పదవి ఇచ్చింది వైసీపీ. ఆయన ఎమ్మెల్యే గణేష్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తనకూ టిక్కెట్ ఇవ్వాలంటున్నారు. అయ్యన్నను వేధించారని.. ఆయన ఇంటిని కూలగొట్టే ప్రయత్నం చేశారన్న సానుభూతి కనిపిస్తోంది. ఓడిపోయినప్పటి నుంచే నర్సీపట్నం నియోజకవర్గ ప్రజల్లో తిరుగడం మొదలుపెట్టిన అయ్యన్నపాత్రుడు.. వచ్చే ఎన్నికల్లో విజయంపై ధీమాగా కనిపిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ ఎక్కడెక్కడ బలహీనంగా ఉందో చూసుకొని.. అక్కడి నేతలను సమన్వయం చేసుకుంటూ.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం బలోపేతానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
నర్సీపట్నం మెయిన్ రోడ్ విషయంలో ఎమ్మెల్యేపై వ్యాపారుల ఆగ్రహం
ఉమాశంకర్ గణేష్ వ్యవహారశైలి కూడా వివాదాస్పదంగా మారింది. గత ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేసిన వారు గణేష్ ని బద్ధ శత్రువులుగా మారారు. నర్సీపట్నంలో రోడ్డు విస్తరణ అనేది ఎన్నికల హామీ.. నర్సీపట్నం మెయిన్ రోడ్డు 80 అడుగులు విస్తరించాలనేది ప్రతిపాదనను తుంగలో తొక్కిన ఎమ్మెల్యే వ్యాపారస్తులకు ఝలక్ ఇచ్చేందుకు 100 అడుగులకు విస్తరించే ప్రతిపాదనను తెరమీదకు తెచ్చారు. దీంతో వ్యాపారులు వ్యతిరేకమయ్యారు.
అభ్యర్థిని మార్చే యోచనలో జగన్
పరిస్థితి బాగోలేకపోవడంతో ఈ సారి ఎమ్మెల్యే గణేష్‌కు టిక్కెట్ లేదన్న ప్రచారం తెరపైకి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే బోలెం ముత్యాల పాపను రంగంలోకి దింపాలని వైసీపీ ప్లాన్ చేస్తుందట. గతంలో అయ్యన్నను ఓడించిది ఈమె. అదే వ్యూహం వచ్చే ఎన్నికల్లో అమలు చేసేలా అధిష్టానం అడుగులు వేస్తున్నట్టు కనపడుతుంది.