ఐదేళ్లు జగన్ పాలనపై ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన రఘురామకృష్ణరాజును ఎంపీ బరిలో నిలిపేందుకు చంద్రబాబు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. స్పేసే లేని చోట క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నర్సాపురం నుంచే బరిలోకి దించేందుకు బీజేపీ పెద్దలతో రకరకాల ప్రతిపాదనలపై చర్చిస్తున్నారు. చంద్రబాబు నివాసంలో జరిగిన సమావేశంలో రెండు, మూడు సీట్లపై చర్చలు జరిగాయి. అందులో ప్రధానంగా నర్సాపురంపైనే చర్చించారు. తుది నిర్ణయం ప్రకటించాల్సింది కేంద్ర పార్టీ కాబట్టి.. ప్రతిపాదనల్ని బీజేపీకి పంపించారు ఆ పార్టీ పరిశీలకులు. అందరూ అంగీకరించినందున.. ప్రకటన లాంచనమేనని అనుకుంటున్నారు.
నర్సాపురం లోక్ సభ స్థానం టీడీపీకి ఇస్తే… ఉండి అసెంబ్లీ సీటు బీజేపీకి ఇస్తారు. నర్సాపురం అభ్యర్థి శ్రీనివాసవర్మకు ఉండి అసెంబ్లీకి పోటీ చేసే చాన్స్ ఇస్తారు. అప్పుడు శ్రీనివాసవర్మకూ న్యాయం చేసినట్లవుతుంది . రఘురామకూ న్యాయం చేసినట్లవుతుంది. నిజానికి ఉండి టీడీపీ కంచుకోట… అయినా రఘురామ కోసం బీజేపీకి ఇవ్వాలని టీడీపీకి నిర్ణయించుకుంది. ఈ ప్రతిపాదనపై బీజేపీ హైకమాండ్ స్పందన పాజిటివ్ గా వస్తే.. మిగిలిన సమస్యలన్నీ టీడీపీ పడనుంది. ఉండిలో ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజునూ బుజ్జగించాల్సి ఉంది.
బీజేపీ ప్రధానంగా లోక్ సభ సీట్లపైనే దృష్టి పెట్టిది. ఖచ్చితంగా గెలుస్తారని భావిస్తున్న నర్సాపురాన్ని వదులుకుంటుందా అన్నది కూడా సందేహమే. అయితే రఘురామను కాదని వేరే అభ్యర్థికి చాన్సివ్వడం వల్ల బిజేపీ ఇబ్బంది పడుతోందన్న రిపోర్టులతో .. ఎవరు గెలిచినా ఎన్డీఏ కూటమికే కాబట్టి.. బీజేపీ పెద్దలు కూడా అంగీకరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఆనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గానికి బదులు ఉంగుటూరు ఇవ్వాలని బీజేపీ కోరినా.. ఇక తమ సీట్ల జోలికి రావొద్దని పవన్ స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో తంబళ్లపల్లెను బీజేపీకి కేటాయించి.. ఆనపర్తిని టీడీపీ నేత రామకృష్ణారెడ్డికి కేటాయించే అవకాశాలు ఉన్నాయి. పద్దెనిమిదో తేదీన నామినేషన్లు ప్రారంభమవుతాయి. ఆ లోపున మొత్తం ప్రకటన వచ్చే అవకాశం ఉంది.