వైసీపీ నుంచి పోటీకి దూరమయ్యేవాళ్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయులు కూడా పోటీ చేయడం లేదని ప్రకటించారు. నర్సరావుపేట నుంచి బీసీకి సీటు ఇస్తామని మీరు తప్పుకోవాలని చెప్పారని .. గుంటూరు నుంచి పోటీ చేయమన్నారని.. దానికి తాను ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. గుంటూరు నుంచి పోటీ చేసే ప్రశ్నే లేదన్నారు. ఆయనకు మరో చాయిస్ హైకమాండ్ ఇచ్చిందో లేదో తెలియదు కానీ.. ఆయన మాత్రం పోటీ చేయడం లేదని ప్రకటించారు.
లావు కృష్ణదేవరాయులు గుంటూరుకు కొత్త కాదు. వైసీపీలో చేరిన తర్వాత ఆయన నాలుగున్నరేళ్ల పాటు గుంటూరు పార్లమెంట్ లోనే పని చేసుకున్నారు. ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి నర్సరావుపేటలో పోటీ చేయాలని సూచిస్తే తప్పనిసరిగా అక్కడకు వెళ్లి పోటీ చేశారు. గెలిచారు. కానీ ఆయనకు మనశ్శాంతి లేకుండా పోయింది. చిలుకలూరిపేటలో విడదల రజనీ చేసిన రచ్చతో ఆయన ను హైకమాండ్ దూరం పెట్టింది. కనీస ప్రోటోకాల్ కూడా ఇవ్వకుండా అనేక అవమానాలకు గురి చేసింది. అన్నింటికీ తట్టుకుని నిలబడి ఉన్నారు. ఇప్పుడు పూర్తిగా చాన్స్ లేని గుంటూరుకు వెళ్లాలని చెప్పడంతో లావు ఆగిపోయారు.
లావు కృష్ణదేవరాయులు చాలా కాలం నుంచి వైసీపీకి కాస్త దూరంగానే ఉంటున్నారు. ఆయన టీడీపీలో చేరుతారన్న ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు ఆయనకు టిక్కెట్ ఎగ్గొట్టడానికి రకరకాల కబుర్లు చెబుతూండటంతో .. లావు డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఆయన టీడీపీలో చేరుతారా లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్… రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.