నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు సుధాకర్‌ను.. ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పలు రకాల అభియోగాలతో కేసులు నమోదు చేసింది. ఈ సుధాకర్.. రెండు రోజుల కిందట.. కరోనా వ్యాప్తి చెందుతున్నా వైద్యులకు కనీసం మాస్కులు, గ్లౌజులు లాంటి పర్సనల్ ప్రొటెక్షన్ కిట్లు లాంటివి ఇవ్వలేదంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాటలు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంశం కావడం.. అదే సమయంలో.. వైసీపీ నేతలు, మంత్రులు N95 మాస్కులతో తిరుగుతున్నా.. వైద్యులకు మాస్కులు కూడా ఇవ్వడం లేదన్న విమర్శలు రావడంతో.. విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
ఓ విచారణ బృందాన్ని ఆస్పత్రికి పంపారు. అక్కడ విచారణలో కూడా.. డాక్టర్లకు అవసరమైన పర్సనల్ ప్రొటెక్షన్ కిట్లు లేవని.. సిబ్బంది చెప్పిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఆ విచారణ నివేదిక ఎలా ఉందో తెలియదు కానీ.. వెంటనే.. ప్రభుత్వం మాత్రం సుధాకర్‌ను సస్పెండ్ చేయడానికే మొగ్గు చూపింది. జాతీయ విపత్తు సమయంలో.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని.. అలాగే 144 సెక్షన్ ఉల్లంఘించారని… ఉన్నతాధికారులను వ్యక్తిగతంగా దూషించారని.. తన మాటల ద్వారా ప్రజలను భయపెట్టారని.. ఆరోపిస్తూ.. పలు నేరాల కింద.. కేసులు పెట్టారు.
డాక్టర్ వీడియో వైరల్ అయినప్పటి నుండి ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి అని ప్రచారం చేయడం ప్రారంభించారు. రాజకీయ కుట్రతోనే ఈ ఆరోపణలు చేస్తున్నారని.. వైసీపీ నేతలు ఎదురుదాడి చేశారు. సాక్షాత్తూ మంత్రి నాని ఆ డాక్టర్‌కు ఎంత బలుపు ఉంటే అలా మాట్లాడతారని మండిపడ్డారు. వైసీపీ నేతలు …డాక్టర్ కూడా …తాను అలా మాట్లాడే ముందు..టీడీపీ నేత అయ్యన్న పాత్రుడ్ని కలిశారంటూ.. డాక్టర్ ఓ ఇంట్లోకి వెళ్తున్న వీడియోను.. విడుదల చేశారు. ఆయనపై అన్నీ రాజకీయ పరమైన ఆరోపణలు చేశారు కానీ.. డాక్టర్ లేవనెత్తిన సమస్యల విషయంలో మాత్రం.. ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు.