‘ఛలో’తో ఓ సూపర్ డూపర్ హిట్టు కొట్టాడు నాగశౌర్య. సొంత సినిమా కాబట్టి… ఆ విజయం మరింత నమ్మకాన్ని పెంచింది. ఇప్పుడు నాగ శౌర్య హీరోగా తెరకెక్కుతున్న ‘@ నర్తనశాల’ కూడా సొంత సినిమానే. ఈ సినిమాపైనా చాలా అంచనాలున్నాయి. `ఛలో` బ్యానర్లో వస్తున్న సినిమా కాబట్టి ట్రేడ్ వర్గాలు ఆసక్తి చూపిస్తున్నాయి. నైజాం, కృష్ణాజిల్లాల్లో ఛలోని సొంతంగా విడుదల చేసుకున్నారు. ఈసారి ఈ ఏరియాలు రెండూ చేతుల్లో ఉంచుకుని, మిగిలిన ఏరియాల్ని మళ్లీ ‘ఛలో’ డిస్టిబ్యూటర్లకే అప్పగించాలని భావిస్తున్నారు. ఈలోగా శాటిలైట్ కీ మంచి గిరాకీ ఏర్పడింది. ఇప్పటికే హిందీ శాటిలైటు రూ.2.75 కోట్లకు అమ్మేశారు. ఓ యువ హీరో సినిమాకీ, అదీ ఎంటర్టైన్మెంట్ చిత్రానికి ఈ రేటు రావడం మంచి విషయమే. తెలుగు శాటిలైట్‌కీ మంచి రేటు పలికే అవకాశం ఉంది. ఓవర్సీస్ కీ మంచి రేటే వచ్చింది. మొత్తంగా ఎలా చూసినా… విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ దక్కడం ఖాయంలా కనిపిస్తోంది. అందుకే నాగశౌర్య కాన్ఫిడెన్స్ లెవిల్స్ కూడా పెరిగిపోయాయి. రేపు (శుక్రవారం) ఫస్ట్ లుక్‌ని విడుదల చేస్తున్నారు. టీజర్ కూడా వచ్చేస్తే.. ఈ సినిమాపై ఓ అంచనాకి వచ్చేస్తాయి ట్రేడ్ వర్గాలు. మరోవైపు ప్రచార కార్యక్రమాలను శ్రీకారం చుట్టడానికి ఐరా క్రియేషన్స్ సంస్థ సన్నాహాలు చేసేస్తోంది. `ఛలో`కి ఓ పెద్ద హీరో సినిమాకి తగ్గని స్థాయిలో ప్రమోషన్ కల్పించారు. ఈసారీ… ప్రమోషన్ల విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని శౌర్య భావిస్తున్నాడు.