కొత్త కాన్సెప్టులు, ఊహకందని కథాంశాలతో సినిమాలు తీయడం బాలీవుడ్ కే చెల్లు. ఎందుకంటే వాళ్లపై హాలీవుడ్ ఇంపాక్ట్ మనకంటే ఎక్కువగా ఉంటుంది. మార్కెట్ ఎక్కువ కాబట్టి… సినిమాని దేశం మొత్తం అమ్ముకోవొచ్చు కాబట్టి, ప్రయోగాలు చేయడానికి ఆస్కారం ఎక్కువ. దానికి తోడు మల్టీప్లెక్స్ సంస్రృతి కూడా విస్తారంగా వృద్ది చెందింది. వాళ్లకు నచ్చే క్లాస్ సినిమా తీసినా చాలు. డబ్బులు చేసేసుకోవొచ్చు. అందుకే అక్కడ ‘విక్కీ డోనర్’లాంటి సినిమాలు వస్తుంటాయి. మన దగ్గరా… కొత్త కాన్సెప్టులకు భుజం తట్టే ట్రెండ్ మొదలైంది. అందుకే అనుకొంటా.. సుమంత్ ‘విక్కీ డోనర్’ని రీమేక్ చేయడానికి ముందుకొచ్చాడు. తెలుగు ప్రేక్షకుల అభిరుచి, ఇక్కడి సెంటిమెంట్లు చూస్తే ‘విక్కీ డోనర్’ ని రీమేక్ చేయడం చాలా సాహసోపేతమైన ప్రయత్నమే అనుకోవాలి. మరి.. ఈ సాహసాన్ని సుమంత్ ఎంత తెలివిగా చేశాడు? ఈ కాన్సెప్ట్ తెలుగు ప్రేక్షకులకు అర్థమవుతుందా? రెండేళ్ల తరవాత ఓ సినిమా చేసిన సుమంత్ కి … ‘నరుడా డోనరుడా’ ఎంత వరకూ ఉపయోగపడుతుంది? చూద్దాం.. పదండి.
* కథ
విక్కీ (సుమంత్) ఓ మధ్యతరగతి యువకుడు. అమ్మ (శ్రీలక్ష్మి) బ్యూటీ పార్లర్ నడుపుతుంటుంది. పాకెట్ మనీ కోసం విక్కీ.. ఇంట్లో ఉన్న కుక్క పిల్లని కూడా అమ్మేసే టైపు. అషిమా రాయ్ (పల్లవి సుభాష్)ని తొలి చూపులోనే ప్రేమించి.. ఆ తరవాత మెల్లగా ప్రేమలోకి దింపేస్తాడు. మరోవైపు సంతాన సాఫల్య కేంద్రం నడుపుతూ.. తన దగ్గరకు వచ్చిన క్లైంట్లకు న్యాయం చేయలేక, బోర్డు తిప్పలేక… ఓ మంచి వీర్యదాత కోసం వెదుకుతుంటాడు ఆంజనేయులు (తనికెళ్ల భరణి) అనే డాక్టర్. తన చూపు విక్కీ పై పడుతుంది. విక్కీ తాత ముత్తాతలు ఒకొక్కరూ డజను మంది పిల్లలకు తండ్రులవ్వడమే అందుకు కారణం. ఆ బీజాలు తన ఆసుపత్రికి పనిచేస్తాయన్న ఉద్దేశంతో విక్కీ వెంట పడతాడు ఆంజనేయులు. స్పెర్మ్ డోనర్ అనే పదాన్ని ముందు చిరాగ్గా చూసిన విక్కీ.. ఆతరవాత కాసుల కోసం, తన అవసరాల కోసం దాన్ని వాడుకోవడానికి ఒప్పుకొంటాడు. అలా.. ఆంజనేయులు సంతాన సాఫల్య కేంద్రం దినదినాభివృద్ది చెందుతుంది. విక్కీ కూడా రెండు చేతులా సంపాదించేస్తుంటాడు. మరోవైపు అషియా కూడా విక్కీతో పెళ్లికి ఒప్పుకొంటుంది. ఇద్దరూ హ్యాపీగా పెళ్లి చేసుకొంటారు. కానీ పెళ్లి తరవాత.. విక్కీ ఓ స్పెర్మ్ డోనర్ అన్న సంగతి అషిమాకి తెలుస్తుంది. అంతేకాదు.. కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలతో.. తనకు పిల్లలు పుట్టరని అర్థమవుతుంది. ఈ నిజాలు తెలుసుకొన్న అషిమా ఏం చేసింది? విక్కీని అర్థం చేసుకొందా, లేదా? అసలు వీళ్లిద్దరికి పిల్లలు పుట్టారా, లేదా? అనేది వెండి తెరపై చూడాల్సిన విషయాలు.
* నటీనటుల ప్రతిభ
సుమంత్ తనకు తగిన పాత్రనే ఎంచుకొన్నాడు. మరీ ముఖ్యంగా ద్వితీయార్థంలో సన్నివేశాలు సుమంత్ లోని నటుడ్ని బయటకు తీసుకొచ్చాయి. తొలి భాగం స్పెర్మ్ డోనర్‌గా చలాకీగా నటించేశాడు. అయితే… అక్కడక్కడా కాస్త అతి చేసినట్టు అనిపిస్తుంటుంది. సుమంత్ స్థానంలో మరో నటుడుంటే ఎలా ఉంటుందన్న ఆలోచనా కూడా ఓ దశలో ప్రేక్షకుడికి వచ్చే అవకాశం ఉంది. ‘రసగుల్ల మొహం..’ అంటూ పల్లవి సుభాష్ గురించి ఓ డైలాగ్ వినిపిస్తుంది ఈ సినిమాలో. మరీ అంత ఘోరంగా కాకపోయినా… పల్లవి బాగానే ఉందనుకోవాలి. ఆల్రెడీ పెళ్లయి, విడాకులు తీసుకొన్న క్యారెక్టర్ కాబట్టి.. ఈ మాత్రం ‘ముదురు విత్తనం’ ఉండాల్సిందే అని దర్శక నిర్మాతలు భావించి ఉంటారు. మరో కీలకమైన పాత్రలో కనిపించిన తనికెళ్ల భరణి… కొన్ని సన్నివేశాల్లో ‘తొలిసారి ఓవర్ యాక్టింగ్’ తో ఇబ్బంది పెడతాడు. వాటిని మినహాయించి చూస్తే… తన సీనియారిటీ, సిన్సియారిటీ తెరపై కనిపిస్తుంది. పెళ్లి కూతురు తండ్రిగా కనిపించిన నటుడు కూడా… ‘ఓవర్ యాక్టింగ్ విత్తనం’ అనిపించాడు.
* సాంకేతిక వర్గం
అన్ని డబ్బులు పోసి రీమేక్ రైట్స్ తీసుకొన్నాం కదా అనుకొన్నారేమో… ఎవ్వరూ సొంత తెలివితేటల్ని వాడలేదనిపిస్తుంది. విక్కీ డోనర్‌లో ఉన్నది ఉన్నట్టుగా తీయడానికే దర్శకుడు మల్లిక్ శ్రమించాడు. ఆఖరికి హీరో ఇంటి సెటప్పులతో సహా. సంభాషణల రచయితల చాతుర్యం బయటపడింది. వీలైనప్పుడల్లా ‘విత్తనం’ అనే పదాన్ని రకరకాలుగా వాడుతూ నవ్వులు పంచారు. పాటలు గుర్తుంచుకొనేలా లేవు. పైగా ఎక్కువైపోయిన ఫీలింగ్. సినిమా అంతా బిట్లు బిట్లుగా పాటలు వినిపిస్తుంటాయి. కెమెరా పనితనం బడ్జెట్ పరిమితులకు, పరిధులకు లోబడే ఉంది. క్వాలిటీ కంటే కంటెంట్ చూడాల్సిన సినిమా కాబట్టి.. వాటినీ పెద్ద మనసుతో క్షమించేయొచ్చు.
* తెలుగు 360 విశ్లేషణ
అసలు విక్కీ డోనర్ అనే బాలీవుడ్ సినిమా పరిచయం లేని ప్రేక్షకులకు నరుడా డోనరుడా కథ, నేపథ్యం కొత్తగా, షాకింగ్ గా అనిపిస్తాయి. `ఈ సినిమాలో ఇలాంటి సన్నివేశాలే ఉంటాయి… ` అని ఫిక్సయిపోయి థియేటర్లో కూర్చుంటే ప్రధమార్థంలో ప్రతీ సన్నివేశాన్నీ ఎంజాయ్ చేయొచ్చు. విక్కీని తన ముగ్గులోకి దింపడానికి ఆంజనేయులు చేసే ప్రయత్నం.. స్పెర్మ్ డొనేట్ చేసినప్పుడల్లా… పుట్టుకొచ్చే షాట్లు, సన్నివేశాలు నవ్విస్తాయి. అయితే వాటిని ఇంకాస్త సుతిమెత్తగా చెప్పాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. అయితే ఉన్నంతలో ఓవర్ డోస్ అనిపించకుండా… పరిధిలోనే ఉండడానికి రచయితలు కష్టపడాల్సివచ్చింది. ఎంత బోల్డ్ కాన్సెప్ట్ అనుకొన్నా.. అత్తా కోడళ్లు కలసి మందు కొట్టడం లాంటి సన్నివేశాల్ని జీర్ణించుకొనే స్థాయికి తెలుగు ప్రేక్షకులు చేరలేదు. అలాంటి సన్నివేశాలనైనా రీ రైట్ చేసుకోవాల్సింది. హీరో హీరోయిన్లు విడిపోయే సన్నివేశాన్ని ఇంకాస్త ఎఫెక్టీవ్‌గా చెప్పాల్సింది. అప్పుడే ద్వితీయార్థంలో పండే డ్రామాకి ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఛాన్సుంది. తొలిభాగం కేవలం స్పెర్మ్ డొనేషన్‌పై.. ద్వితీయార్థం భార్యా భర్తలు విడిపోవడం పై సాగుతాయి. కాబట్టి చూసిన సన్నివేశమే మళ్లీ చూస్తున్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా కోసం మరోసారి మనసు పెట్టి ఎడిటింగ్ చేస్తే.. మరో 20 నిమిషాల్ని ట్రిమ్ చేయొచ్చు. పెళ్లి చూపుల సీన్లో యమహా నగరి.. అంటూ హీరో పాట అందుకోవడం.. ఆ సన్నివేశం మరీ లెంగ్తీగా ఉండడం విసుగు అనిపిస్తాయి. పిల్లలు లేని తల్లులు పడుతున్న బాధ.. ఆ ఇంట్లో ఆవేదన సరిగా పోట్రయిట్ చేయగలిగితే.. ఈ సినిమానీ, స్పెర్మ్ డొనేషన్ అనే కాన్సెప్టునీ మరింత విశాల హృదయంతో చూసే అవకాశం దక్కుతుంది. ఏ క్లాస్ ఆడియన్స్ కోసం తీసిన సినిమా అని అర్థమవుతోంది. బడ్జెట్ పరిమితుల్లోనే ఈసినిమా తీశారు కాబట్టి…మల్టీప్లెక్స్ ఆడియన్స్ చూసినా.. నరుడా డోనరుడా గట్టెక్కేస్తుంది.
తెలుగు360 రేటింగ్ : 2.5/5