నందమూరి బాలకృష్ణ అంటే అదిరిపోయే డైలాగులే కాదు, కళ్లు చెదిరే డాన్సులు కూడా. `జై సింహా`ట్రైలర్లు చూస్తుంటే… ఓ బన్నీలా, ఓ ఎన్టీఆర్‌లా.. సిగ్నేచర్ స్టెప్పులేసి అలరిస్తున్నాడు. థియేటర్లో చూడ్డానికి ఇలాంటి స్టెప్పుల్ని చాలా దాచార్ట. అలాంటి బాలయ్యతో డాన్సులు చేయాలంటే ఎవ్వరికైనా హడలే. కానీ కొత్తమ్మాయి నటాషా దోషి మాత్రం బాలయ్యతో స్టెప్పుల్ని బాగానే మానేజ్ చేసింది. ‘జై సింహా’ ఆమెకు తొలి తెలుగు సినిమా. అయినా సరే… అమ్మకుట్టి పాటలో బాలయ్యతో సరిసమానంగా స్టెప్పులేసి ఆకట్టుకుంటోంది. బాలయ్యతో డాన్స్ చేయడం ఎలా ఉంది? అని అడిగితే తెగ సంబర పడిపోతోంది. తనకు క్లాసికల్ డాన్స్ వచ్చని, వెస్ట్రన్ కూడా నేర్చుకున్నానని, డాన్స్ అంటే చాలా ఇష్టమని, అలాంటిది తనే బాలయ్యతో స్టెప్పులేయకపోయానని చెబుతోంది నటాషా. ”బాలకృష్ణగారంటేనే డాన్సులు… ఆయన స్టెప్పులు చూడ్డానికి జనం థియేటర్‌కి వస్తారు. అలాంటి కథానాయకుడి పక్కన డాన్స్ చేయడం ఎవరికైనా కష్టమే. ఈ సినిమాలో నా డాన్సులకూ పేరొస్తే.. అది బాలయ్య పుణ్యమే. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని డాన్సులు చేశా” అని చెబుతోంది నటాషా. బేసిగ్గా నటాషా ఓ డెంటిస్ట్. మెడిసెన్ చేద్దామనుకుందట. కానీ.. డెంటిస్ట్ కోర్సు పూర్తి చేసింది. ఎప్పటికైనా… ఓ ఆసుపత్రి కట్టడమే తన లక్ష్యమని చెబుతోంది నటాషా. జై సింహా హిట్టయి నటాషాకీ మంచి పేరొస్తే.. తెలుగు చిత్రసీమకు మరో హీరోయిన్ దొరికేసినట్టే.